Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడులో మరో మంత్రి ఇంటిపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్‌ కేసులో దాడులు

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: దేశ వ్యాప్తంగా మనీలాండరింగ్‌లో వివిధ రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్‌(ఈడీ) దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడైతే డబ్బు ఎక్కువ మొత్తంలో అవినీతిగా బయటికొచ్చిందో అక్కడ.. మనీలాండరింగ్‌ జరిగిందనే ఆరోపణలు, ఫిర్యాదులు అందుతుండటంతో ఈడీ దాడులు చేస్తోంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ విషయంలో కూడా పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని.. దాంతో ఈడీ పేపర్‌ లీకేజీకి సంబంధించి అనుమానితులుగా ఉన్న వారిని విచారించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో గత నెలలో ఒక మంత్రి ఇంటిపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు తాజా తమిళనాడులో మరో మంత్రి ఇంటిపై ఈడీ దాడులు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో సంబంధం ఉందనే ఆరోపణలతో ఈడీ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఒక మంత్రి ఇంటిపై దాడులు చేసిన ఈడీ ఆ తరువాత మంత్రిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో అధికారపార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై సీఎం స్టాలిన్‌ కేబినెట్‌లోని మంత్రి సెంథిల్‌ బాలాజీని అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా మరో మంత్రి ఇంటిపై దాడులు చేస్తున్నది. మనీలాండరింగ్‌ కేసులో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కే.పొన్ముడి తోపాటు ఆయన కుమారుడు కల్లకురిచి ఎంపీ గౌతమ్‌ సిగమణి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైతోపాటు విల్లుపురంలోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి.

Read also: Delivery Service Fraud: వీడు మామూలోడు కాదు.. డెలివరీ సర్వీస్ పేరుతో ఘరానా మోసం

2007 నుంచి 2011 వరకు గనుల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్ముడి.. క్వారీ లైసెన్స్‌ షరతులు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.28 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసు విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలైన మంత్రి కే.పొన్ముడి పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. రాజకీయ వేధింపులలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ దాడులకు పాల్పడుతుందని డీఎంకే పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ రోజు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల కూటమి సమావేశానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ హాజరుకానున్న నేపథ్యంలో ఈడీ ఈ దాడులు నిర్వహించడంపై డీఎంకే నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే బీజేపీ రాష్ట్రంలో ఈడీ దాడులు చేయిస్తోందని డీఎంకే నేతలు మండిపడుతున్నారు.

Exit mobile version