ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోల్ కతాకు చెందిన ఓ సంస్థకు సంబంధించిన హవాలా లావాదేవీల్లో ఢిల్లీ ఆరోగ్య, హోం మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయన నివాసంతో పాటు అతని సహాయకుడి నివాసంలో మంగళవారం ఈడీ భారీ ఎత్తున సోదాాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీ ఎత్తున బంగారం, నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. మొత్తం రూ. 2.82 కోట్ల నగదుతో పాటు, 1.80 కిలోల 133 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
జూన్ 9 వరకు సత్యేందర్ జైన్ ను ఈడీ కస్టడీలోనే ఉండాలని ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ఆదేశించారు. పెద్ద కుట్రను వెలికి తీయాల్సి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే సత్యేందర్ జైన్ కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిషేధ చట్టం కింద అటాచ్ చేసింది.
ఈడీ రైడ్స్ పై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన దాడులుగా అభివర్ణించారు. కేంద్ర సంస్థలతో మాపై దాడులు చేయించవచ్చు కానీ.. భగవంతుడు మాతోనే ఉన్నాడంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఇంఛార్జ్ గా ఉన్న సత్యేందర్ జైన్ ను అరెస్ట్ చేయడంలో కుట్ర దాగుందని విమర్శలు చేస్తున్నారు ఆప్ నేతలు. వచ్చే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే ఇలా కేంద్ర సంస్థలతో దాడులు చేస్తుందని విమర్శిస్తున్నారు.