IndiGo Flight: దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో మంటలు.. రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో మంటలు
  • రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • 194 మంది ప్రయాణికులు సురక్షితం
Indigo

Indigo

దుబాయ్ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో పొగలు రావడంతో సోమవారం అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. విమానంలో మంటలు కనిపించడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లు చేశారు. పైలట్ అప్రమత్తతతో విమానం సురక్షితంగా రాజ్‌కోట్ విమానాశ్రయంలో దిగింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో విమానంలో ఉన్న 194 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానంలో పొగ కనిపించడంతో పైలట్ వెంటనే రాజ్‌కోట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. పరిస్థితిని అంచనా వేసిన అధికారులు వెంటనే రన్‌వేను సిద్ధం చేసి విమానాన్ని సురక్షితంగా దించారు. రాజ్‌కోట్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇటీవలి నెలల్లో ఇండిగో విమానానికి సంబంధించి ఇది రెండో అత్యవసర ఘటన కావడం గమనార్హం.

గత మే నెలలో హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్లిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలడంతో క్యాబిన్‌లో పొగ వ్యాపించింది. ఆ సమయంలో విమానం షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయి పార్కింగ్ బే వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమాన సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ.. క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోవడంతో అత్యవసరంగా ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్‌ల ద్వారా ప్రయాణికులను బయటకు తరలించారు. ఆ ఘటనలో ఒక ప్రయాణికుడు స్వల్పంగా గాయపడగా.. మిగిలిన వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం దుబాయ్-ముంబై ఇండిగో విమానంలో పొగ రావడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.