Drug seizure at Mumbai and Chennai airports: అంతర్జాతీయ విమానాశ్రాయాలు, పోర్టులు డ్రగ్స్ అక్రమ రవాణాకు కేరాఫ్ గా మారుతున్నాయి. ప్రతీ రోజు ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక నుంచి భారత్ లోకి డ్రగ్స్ తీసుకువస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు డ్రగ్స్ ను ఇండియాలోకి తీసుకువస్తున్నారు. తాజాగా గురువారం రోజు చెన్నై, ముంబై ఎయిర్ పోర్టుల్లో డ్రగ్స్ తీసుకువస్తున్న ఆఫ్రికా జాతీయులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై విమానాశ్రయంలో ఏకంగా ‘ వీడొక్కడే ’ సినిమా సీన్ రిపీట్ అయింది. సినిమాలో డ్రగ్స్ ను క్యాప్సుల్స్ లో పెట్టి కడుపులో దాచిన సన్నివేశం ఉంటుంది. సరిగ్గా అలాగే టాాంజానియా నుంచి వస్తున్న వ్యక్తి కడుపులో రూ. 8.86 కోట్ల విలువైన 1.266 కిలోల హెరాయిన్ కనుగొన్నారు. మొత్తం 86 క్యాప్సుళ్లను కడుపులో దాచాడు. చెన్నై ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా కడుపులో ఉన్న డ్రగ్స్ గుట్టు తెలిసింది.
Read Also: Tamil Nadu: తమిళనాడులో 22 చోట్ల ఎన్ఐఏ దాడులు.. ఎల్టీటీఈ పునరుద్ధరణకు మాఫియా ప్రయత్నం
ఇదే విధంగా ముంబైలో ఉగాండా జాతీయుడి పట్టుబడ్డాడు. ముంబై పోలీస్, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉగండా జాతీయుడి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన ఒక కిలో మెథాక్వలోన్ డ్రగ్ ను గుర్తించారు. చెన్నైలో లాగా ఇక్కడ కూడా డ్రగ్స్ ను నిందితుడు శరీరంలో దాచి పెట్టాడు. అతన్ని జేజే ఆసుపత్రికి తీసుకెళ్లి డ్రగ్స్ బయటకు తీశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు పంజాబ్ అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన భారతీయుడి వద్ద నుంచి రూ. 49.27 లక్షల విలువైన 933.2 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బ్యాగేజీలో దాచిపెట్టిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.