Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో డ్రోన్లు, డ్రగ్స్ అక్రమరవాణాపై చర్చించారు. డ్రగ్స్ మాఫియాకు పాకిస్తాన్ రక్షణ ఇస్తోందని భగవంత్ మన్, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా నివాసంలో దాదాపుగా 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. పంజాబ్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు భద్రతపై ఇరువురు నేతల చర్చించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రామీణాభివృద్ధి నిధులను విడుదల చేయాలని సీఎం భగవంత్ మన్, హోంమంత్రిని కోరారు.
Read Also: Hathras case: హత్రాస్ అత్యాచారం కేసులో కీలక తీర్పు.. ఒకరికి జీవిత ఖైదు..
గతేడాది భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం 22 డోన్లను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. దాదాపుగా 316 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ సరిహద్దుల్లో ఇద్దరు పాక్ చొరబాటుదారులను బీఎస్ఎఫ్ కాల్చి చంపింది. దీంతో పాటు ఆయుధాలను, 23 మంది పాకిస్తాన్ వ్యక్తులను వివిధ ఘటనల్లో బీఎస్ఎఫ్ పట్టుకుంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో విస్తరిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాదంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల అమృత్ సర్ లో అజ్నాలా పోలీస్ స్టేషన్ పై ఖలీస్తానీ వేర్పాటువాద సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ అతని మద్దతుదారులు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏకంగా కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలకే వార్నింగ్ ఇచ్చారు అమృత్ పాల్ సింగ్. ఈ దాడిలో ఒక ఎస్పీతో సహా ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు.
