భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపొందారు. భారతదేశంలో తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా, రెండో మహిళా రాష్ట్రపతిగా ముర్ము గెలుపొంది చరిత్ర సృష్టించారు. గురువారం జరిగిన రాష్ట్రపతి ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి మద్దతుతో పోటీ చేసి ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించారు. ఇదిలా భారత 15వ రాష్ట్రపతిగా గెలుపొందిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. కాబోయే రాష్ట్రపతికి, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. పార్టీలకు అతీతంగా ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రధాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె విజయం ప్రజాస్వామ్యానికి శుభసూచకం అని మోదీ అన్నారు. ఈ గెలుపు ప్రజల ద్వారా ముర్ము ప్రజల ఆశాకిరణంగా అవతరించారని ఆయన ప్రశంసలు కురిపించారు.
Read Also: Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. తొలి గిరిజన మహిళగా రికార్డ్
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిరణ్ రిజిజు, పియూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషితో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలైన వారు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్రౌపది ముర్మును అభినందిస్తూ ట్వీట్ చేశారు. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము జీకి హృదయపూర్వక అభినందనలు.. భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు.. రాష్ట్రపతిగా ప్రయాణం ప్రారంభించినందుకు శుభాకాంక్షలు.. అత్యంత అంకితభావంతో దేశానికి సేవ చేయాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.