DoT Warning: భారత టెలికాం శాఖ (DoT) మొబైల్ ఫోన్ల తయారీదారులు, దిగుమతిదారులు, బ్రాండ్ యజమానులు, రీసెలర్లకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ – 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ – 2024 ప్రకారం IMEI రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించడం తప్పనిసరని DoT స్పష్టం చేసింది. టెలికాం నెట్‌వర్క్ భద్రతను బలోపేతం చేయడం, నకిలీ పరికరాలను అరికట్టడం, చట్టపరమైన విధానాలను కచ్చితంగా అమలు చేయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యం.

ఇక ఎలాంటి ప్రధాన చట్టపరమైన నిబంధనలు తీసుకోనున్నారంటే.. టెలికమ్యూనికేషన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 42(3)(c) ప్రకారం మొబైల్ ఫోన్లలో లేదా ఇతర పరికరాలలో టెలికాం ఐడెంటిఫైయర్‌లను (IMEI సహా) మార్చడం పూర్తిగా నిషేధం చేయనున్నారు. అలాగే సెక్షన్ 42(3)(f) ప్రకారం తెచానాలజీ వినియోగించి మార్చిన IMEI మొబైల్‌లు, సిమ్‌బాక్స్‌లు, మోడెమ్‌లు, ఇతర టెలికాం మాడ్యూళ్లు కలిగి ఉన్నా నేరంగా పరిగణిస్తారు. ఒకవేళ ఇలా చేసినట్లయితే.. సెక్షన్ 42(7) ప్రకారం ఈ నేరాలకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. IMEI మార్పులను ప్రోత్సహించినా లేదా సహకరించినా సెక్షన్ 42(6) ప్రకారం అదే శిక్షలు వర్తిస్తాయి.
కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాల్సిన IMEI రిజిస్ట్రేషన్ నియంత్రణ నిబంధనలు ఏంటంటే.. భారత్‌లో తయారు చేస్తున్న ప్రతి పరికరం IMEI నంబర్లను విక్రయానికి ముందే రిజిస్టర్ చేయాలి. ఇంకా ఇండియాలోకి దిగుమతి చేసే పరికరాలన్నీ దిగుమతికి ముందే IMEIలను రిజిస్టర్ చేయాలి. ఇవి Device Setu – ICDR పోర్టల్ ద్వారా పూర్తి చేయాలి. ముఖ్యంగా టెలికాం సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనల 2025 ప్రకారం ఇప్పటికే భారత నెట్‌వర్క్‌లలో ఉపయోగంలో ఉన్న IMEIలను కొత్త పరికరాలకు కేటాయించడం పూర్తిగా నిషేధం.

వీటితోపాటు పాత లేదా వాడిన పరికరాలను కొనుగోలు, విక్రయాలు చేసే వ్యాపారులు ప్రతి IMEIని ప్రభుత్వ నెట్‌వర్క్‌లోని బ్లాక్-లిస్ట్ లేదా టాంపర్డ్ డేటాబేస్‌తో తప్పనిసరిగా చెక్ చేయాలి. ప్రతి IMEI పరిశీలనకు ఫీజు వర్తిస్తుంది. రూల్ 8(3) ప్రకారం టెలికాం ఐడెంటిఫైయర్‌లను తొలగించడం, మార్చడం, నియంత్రించడం పూర్తిగా నేరం. IMEI ప్రోగ్రాం చేయగలిగే పరికరాలు (ప్రోగ్రామబుల్ IMEI డివైసులు) కూడా చట్టపరంగా “టాంపర్డ్ డివైసెస్”గా పరిగణించబడతాయి. అలాగే రూల్ 5 ప్రకారం కేంద్ర ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లకు IMEI తారుమారు చేసిన పరికరాలను నెట్‌వర్క్ నుండి బ్లాక్ చేయమని ఆదేశించవచ్చు.
