పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులపై హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన.. ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రక్తంతో తడిచే బెంగాల్ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఈ భూమిలో హింసకు చోటు లేదన్న ఆయన.. ఇక్కడ ఎవరి మనస్సు కూడా భయం నుండి విముక్తి పొందలేదని కామెంట్ చేశారు. ప్రభుత్వ అధికారులు, సీఎంను తాను అభ్యర్థిస్తున్నానని, ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందడం మనకు చాలా అవసరమన్నారు. ప్రజల్లో భయాందోళన ఎక్కువగా ఉన్నదని, ప్రజాస్వామ్యం చివరి శ్వాసను పొందుతున్నదని గవర్నర్ విమర్శించారు.
బెంగాల్‌లో అవసరమైన చర్యలను సీఎం మమతా బెనర్జీ తీసుకుంటారని, ప్రభుత్వం సానుకూల విధానాన్ని అవలంభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు గవర్నర్ జగదీప్ ధంఖర్.. బెంగాల్ అగ్నిగోళంగా మారడాన్ని తాను అనుమతించను అన్నారు. మరోవైపు.. ఫిరాయింపుల వ్యతిరేక చట్టం, తిల్జాల, చందన్ నగర్ సంఘటనలతో సహా నాలుగు అంశాలను తన దృష్టికి తెచ్చేందుకు సువేందు అధికారితో సహా 50 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తనకు మెమోరాండం అందజేసినట్లు తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే బెంగాల్‌లో కూడా ఫిరాయింపుల వ్యతిరేక చట్టం పూర్తిస్థాయిలో వర్తిస్తుందన్నారు.. కాగా, ఎన్నికల ముందు టీఎంసీని వీడి.. బీజేపీలో చేరిన కొందరు నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు సైతం.. మళ్లీ టీఎంసీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.