Tipu Sultan Issue: కర్ణాటక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అక్కడ మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టిప్పు సుల్తాన్ ను సమర్థిస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తుండగా.. బీజేపీ టిప్పు సుల్తాన్ ను విమర్శిస్తోంది. ఈ రెండు పార్టీలు టిప్పు పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనిపై టిప్పు వారసులు స్పందించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం టిప్పు సుల్తాన్ పేరు ఉపయోగించవద్దని.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు.. సీఎం కేసీఆర్ నిర్ణయం
టిప్పు సుల్తాన్ 7వ తరం వారసుడు సహబ్జాదా మన్సూర్ అలీ మాట్లాడుతూ.. టిప్పు సుల్తాన్ పేరును రాజకీయాల్లోకి లాగొద్దని, ఇలా చేస్తే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు టిప్పు కుటుంబం, అనుచరుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన అన్నారు. టిప్పు కోసం ఏ పార్టీ కూడా ఏం చేయలేదని.. ఆయన పేరును ఓట్లను పొందేందుకే వాడుకుంటున్నాయని విమర్శించారు.
కర్ణాటక ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్ మధ్య టిప్పు వార్ కొనసాగుతోంది. కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు టిప్పు వర్సెస్ సావర్కర్ గా జరుగుతాయని అన్నారు. రాముడు, హనుమాన్ కు ఓటేయడం ద్వారా టిప్పు వారసులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. అంతకుముందు బెంగళూర్-మైసూర్ టిప్పు ఎక్స్ ప్రెస్ రైలు పేరును రైల్వే బోర్డు వడయార్ ఎక్స్ ప్రెస్ గా మార్చింది. దీనిపై ఎంఐఎం చీఫ్ మాట్లాడుతూ.. టిప్పు పేరు తొలగించగలరు కానీ.. ఆయన వారసత్వాన్ని బీజేపీ ఎప్పటికీ తుడిచివేయదని అన్నారు.