HMPV Virus: ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్ ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కలవరపెడుతోంది. కోవిడ్-19 వ్యాధికి 5 ఏళ్లు ఇటీవల పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా వైరస్ చేదు సమయాన్ని మరిచిపోతున్నారు. ఇంతలో HMPV వైరస్ రావడం ప్రజల్ని భయపెడుతోంది. అయితే, దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వంతో పాటు నిపుణులు చెబుతున్నారు. అంతటి కరోనానే మనం సమర్థవంతంగా తట్టుకున్నామని, దానితో పోలిస్తే కొత్త వైరస్ పెద్దగా ప్రమాదమేమీ కాదని చెబుతున్నారు. అయితే, దీనిని మనం అరికట్టేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బెటర్.
చేయాల్సిన పనులు:
* దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్, టిష్యూ పేపర్ వంటివి అడ్డుపెట్టుకోవాలి.
* సబ్బు లేదా ఆల్కాహాల్‌లో కూడిన శానిటైజర్‌తో తరుచూ చేతులు శుభ్రపరుచుకోవాలి.
* గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.
* జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు.
* అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇతరులను కలుసుకోవడం తగ్గించాలి, ఇంటికే పరిమితం కావాలి.
* మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
చేయకూడని పనులు:
* ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు.
* ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లు, హ్యాండ్ కర్చీఫ్స్‌ని మళ్లీ వాడకూడదు.
* అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.
* తరచూ కంటిని నలుపుకోవడం, ముక్కు, నోటిని చేతితో తుడుచుకోవడాన్ని మానుకోవాలి.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు.