Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీ రాగానే ఆయన గత పాలకుడు జో బైడెన్ నిర్ణయాలను రద్దు చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉంటే, తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘బర్త్ రైట్ పౌరసత్వం’’ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో ముఖ్యంగా విదేశాల నుంచి అమెరికా వెళ్లిన వారికి భారీ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా భారతీయ వలసదారులకు ఈ పరిణామం మింగుడుపడటం లేదు.
జన్మహక్కు(బర్త్ రైట్) పౌరసత్వం అంటే ఏమిటి..?
అక్రమ వలసల్ని అడ్డుకుంటానని చెప్పిన ట్రంప్, బర్త్ రైట్ పౌరసత్వాన్ని కూడా నిలిపేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు. తొలి రోజే ఈ రెండు ఆర్డర్స్‌ని పాస్ చేశాడు. బర్త్ రైట్ పౌరసత్వం అంటే.. అమెరికా సార్వభౌమాధికారం కలిగిన ప్రాంతంలో పుట్టిన బిడ్డకు ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం లభించే విధానం. ఈ విధానంలో పిల్లాడి తల్లిదండ్రులు అమెరికన్లు కాకుండా విదేశీయులు అయినప్పటికీ, బిడ్డ అమెరికాలో పుట్టిన కారణంగా అతడిని అమెరికన్ సిటిజన్‌షిప్ వస్తుంది. ఈ నిబంధన 1868లో అమలులోకి వచ్చింది మరియు USలో జన్మించిన వారందరికీ పౌరసత్వాన్ని విస్తరించడానికి రూపొందించబడింది. ఈ విధానాన్నే ప్రస్తుతం ట్రంప్ రద్దు చేశారు. జన్మహక్కు పౌరసత్వం అనేది దక్షిణాది రాష్ట్రాల్లో నల్లజాతీయులను బానిసలుగా చేసే పద్ధతిని అడ్డుకునేందుకు, అమెరికన్ అంతర్యుద్ధం ముగిసిన మూడు ఏళ్ల తర్వాత 1868లో ఆమోదించిన రాజ్యాంగంలోని 14వ సవరణ నుంచి వచ్చింది.
రద్దు చేసిన ట్రంప్:
ట్రంప్ సంతకం చేసిన ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం.. అమెరికాలో పుట్టిన బిడ్డకు పౌరసత్వం లభించాలంటే కనీసం తల్లిదండ్రుల్లో ఒకరు అమెరికా పౌరుడు లేదా చట్టబద్దమైన శాశ్వత నివాసి (గ్రీన్ కార్డ్ హోల్డర్) లేదా అమెరికా సైన్యంలో సభ్యుడి ఉండాలి. ఈ అర్హతలు లేకుంటే పుట్టిన బిడ్డకు పౌరసత్వం లభించదు. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 20, 2025 నుంచి అమలులోకి వస్తాయి. అప్పటి లోగా పుట్టిన పిల్లలకు యూఎస్ సిటిజన్‌షిప్ వస్తుంది. ఆ తర్వాత ఈ విధానం ఉండదు.
భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం:
భారత్, చైనాల నుంచి వచ్చే వలసదారులు అమెరికన్ల అవకాశాలను హరిస్తున్నారని పలు సందర్భాల్లో ట్రంప్ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా భారతీయులు అమెరికాను స్వర్గధామంగా భావిస్తారు. బెటర్ లైఫ్ కోసం అక్కడే స్థిరపడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు ట్రంప్ నిర్ణయం షాక్ అని చెప్పొచ్చు.
2024 నాటికి, భారతీయ అమెరికన్లు 5.4 మిలియన్లకు పైగా ఉన్నారు, ఇది US జనాభాలో 1.47 శాతం. అధికారిక డేటా ప్రకారం, దాదాపు మూడింట రెండు వంతుల మంది వలసదారులు భారతీయులే. 34 శాతం మంది యూఎస్‌లో జన్మించిన వారు ఉన్నారు. ట్రంప్ ఉత్తర్వులతో తాత్కాలిక వర్క్ వీసాలపై (H-1B వీసా వంటివి) లేదా గ్రీన్ కార్డుల కోసం వేచి ఉన్న భారతీయ పౌరులకు జన్మించిన పిల్లలు ఇకపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
బర్త్ టూరిజం ముగింపు:
ఈ విధానంతో అమెరికాకు ‘‘బర్త్ టూరిజం’’ కోసం వెళ్లే వారికి షాక్‌గా చెప్పొచ్చు. కొన్ని ఉన్నత కుటుంబాలకు చెందిన భారతీయలు తమ పిల్లల్ని అమెరికాలో కనాలని అనుకుంటారు. దీని వల్ల తమ పిల్లాడికి అమెరికన్ సిటిజన్‌షిప్ వస్తుందని భావిస్తారు. ఈ విధానం ఒక్క భారతీయులే కాకుండా, చాలా మంది విదేశీయులు బర్త్ టూరిజం కోసం ఇన్నాళ్లు యూఎస్ వెళ్లారు. ఇప్పుడు దీనికి ట్రంప్ ముగింపు పలికారు.
చట్టం అమలు అంత ఈజీ కాదు:
ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ని ఇచ్చినప్పటికీ, రాజ్యాంగంలోని నిబంధనలు మార్చడానికి రాజ్యాంగ సవరణ అవసరం. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. సవాల్‌తో కూడుకున్నది. యూఎస్ రాజ్యాంగాన్ని సవరించడానికి హౌజ్, సెనెట్ రెండింటిలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఓట్లు అవసరం. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభలలో మూడింట రెండు వంతుల ఆమోదం కావాలి. కొత్త సెనెట్‌లో డెమొక్రాట్లు 47 స్థానాలు కలిగి ఉండగా, రిపబ్లికన్లు 53 స్థానాలు కలిగి ఉన్నారు. ఇక హౌజ్‌లో డెమొక్రాట్లు 215 సీట్లు కలిగి ఉండగా, రిపబ్లికన్లు 220 స్థానాలను కలిగి ఉన్నారు.
మరోవైపు యూఎస్ సుప్రీంకోర్టు జన్మత వచ్చే పౌరసత్వాన్ని సమర్థించింది. యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ (1898) కేసులో, యుఎస్‌లో పౌరుడు కాని తల్లిదండ్రులకు జన్మించిన బిడ్డ ఇప్పటికీ యుఎస్ పౌరుడని కోర్టు తీర్పు ఇచ్చింది.