Site icon NTV Telugu

Doctors Protest: నేటి నుంచి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన డాక్టర్ల సంఘం..

Docters

Docters

Doctors Protest: పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా నేటి (అక్టోబర్ 14) నుంచి ఎలక్టివ్ సర్వీసులను బహిష్కరించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆదివారం దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు, రెసిడెంట్ డాక్టర్లను కోరింది. అయితే, ట్రైనీ డాక్టర్లకు సంఘీభావంగా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని దాదాపు 79 మంది సీనియర్ వైద్యులు, అధ్యాపకులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు FAIMA ప్రకటించింది.

Read Also: Vishwambhara : రికార్డుల దుమ్ముదులుపుతున్న విశ్వంభర టీజర్

ఇక, నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైద్యుల పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఆరోపించింది. మా సహోద్యోగులకు సంఘీభావంగా వైద్యులపై నానాటికీ పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నేటి నుంచి అత్యవసర చికిత్సలు మినహా మిగతావి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పశ్చిమ బెంగాల్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులందరికి భద్రతను కల్పించాలని అఖిల భారత వైద్య సంఘాల సమాఖ్య (FAIMA) డిమాండ్ చేసింది. మరోవైపు, డాక్టర్ల నిరసనలో బీజేపీ కార్యకర్తలు, బెంగాల్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్ కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా వైద్యుల డిమాండ్లను నెరవేరుస్తామని మమతా బెనర్జీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు దానిని తుంగలో తొక్కిందని విమర్శించారు.

Exit mobile version