Actor Darshan: తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో కన్నడ యాక్టర్ దర్శన్ జైలులో ఉన్నాడు. నటి పవిత్రగౌడ్‌తో దర్శన్ రిలేషన్‌షిప్ గురించి ఆమెకు అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లను పంపిస్తున్నాడనే కారణంతో పథకం ప్రకారం బెంగళూర్‌కి తీసుకువచ్చి దర్శన్, అతడి సహాయకులు చిత్రహింసలు చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇటీవల బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌కి వీఐపీ సౌకర్యాలు పొందుతున్న ఫోటోలు వైరల్ కావడంతో అతడిని బళ్లారి జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే, బళ్లారి జైలు జైలర్ దర్శన్‌కి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జైలులో తనకు కల్పించిన సౌకర్యాలపై ఎలాంటి గొడవలు సృష్టించవద్దని దర్శన్‌ని జైలర్ హెచ్చరించారు. మీరు ఈ అహంకా, మొండి వైఖరిని కొనసాగిస్తే తీవ్ర పరిణామలు ఉంటాయిని చెప్పినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్నవి మాత్రమే అందించగలమని తెలియజేయడంతో తరుచూ దర్శన్ జైలు సిబ్బందితో వాదిస్తున్నాడని, అదనపు సౌకర్యాలు కావాలంటే కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దర్శన్ కస్టడీలో అతని ప్రవర్తనను, జైలు నిబంధనలను కోర్టు నిశితంగా పరిశీలిస్తోందని జైలర్ గుర్తు చేశారు. జైలు అధికారులకు సహకరించే బదులు దర్శన్ క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని జైలర్ చెప్పినట్లు సమాచారం.
Read Also: Karnataka: సీఎం కార్యక్రమంలో భద్రతా లోపం.. సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన యువకుడు
ఇదిలా ఉంటే, ఇటీవల దర్శన్ మీడియాకు అసభ్యకరంగా మిడిల్ ఫింగర్ చూపించిన వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. మరోవైపు దర్శన్ తన బెయిల్ పిటిషన్‌ని ఇంకా కోర్టుకు సమర్పించకపోవడంతో జైలులో నిరాశకు గురయ్యాడని సిబ్బంది చెప్పారు. సాధారణ కేసుల్లో, హత్య నిందితులకు 90 రోజుల తర్వాత లేదా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత బెయిల్ మంజూరు చేయబడుతుంది. అయితే, దర్శన్ కేసులో ఛార్జిషీట్ సమర్పించే సమయంలో బెంగళూర్ జైలులో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించబడుతున్న ఫోటోలు బయటకు రావడంతో బెయిల్ వాయిదా పడింది.
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడలతో పాటు 15 మంది నిందితులకు కోర్టు జుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 17 వరకు పొడగించింది. జూన్ 8న బెంగళూర్‌లో రేణుకాస్వామి హత్య జరిగింది. తీవ్రంగా దాడి చేసిన కారణంగా అతను చనిపోయాడు. ఈ కేసులో బెంగళూర్ పోలీసులు నిందితులపై 3991 పేజీల ఛార్జిషీట్ సమర్పించారు.