Tamil Nadu: తమిళనాడు మధురై జిల్లాలో జరగనున్న ‘‘మురుగన్ సదస్సు’’ను ఉద్దేశిస్తూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కార్యక్రమం మతం, జాతి, భాష పేరుతో ప్రజలను విభజించడానికి రూపొందించారని విమర్శించింది. జూన్ 22న జరిగే ఈ సదస్సుకు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వంటి ఇతర రాష్ట్రాల నేతలు రావడాన్ని ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నేతలు రావడం ఏంటని తమిళనాడు హిందూ మత మరియు ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు అడిగారు.
Read Also: Strait of Hormuz: “హార్మూజ్ జలసంధి”ని మూసేయాలని ఇరాన్ ప్లాన్.. ఇదే జరిగితే చమురు సంక్షోభం..
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు తమిళనాడు మధ్య సంబంధం ఏమిటి? యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు తమిళనాడు మధ్య సంబంధం ఏమిటి?” అని శేఖర్ బాబు పశ్నించారు. “దేవాలయాలు న్యాయం , క్రమశిక్షణను ప్రచారం చేయడమే. కానీ ఈ వ్యక్తుల సమావేశం జాతి, భాష, మతం ఆధారంగా విభజనలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాంటి సమావేశాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను.” అని అన్నారు.
జూన్ 22న జరగబోయే మురుగన్ సదస్సుకు ముందు ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అధికార డీఎంకే దీనిని రాజకీయ ప్రేరేపిత సమావేశమని విమర్శించింది. అయితే, బీజేపీతో సహా ఏఐడీఎంకే పార్టీలు ఈ సమావేశాన్ని భక్తి వేడుకగా స్వాగతించాయి. జూన్ 8న మధురైలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. డీఎంకే మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని, కుమారస్వామి ఆరు పవిత్ర స్థలాల్లో ఒకటైన తిరుపరంకుండ్రం కొండ వివాదాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు.
