DMK Supports Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. కేంద్రం హామీతో స్టాలిన్ తీర్మానం..

Dmk

Dmk

DMK Supports Delimitation Bill: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ తీసుకొస్తున్న డీలిమిటేషన్‌ బిల్లు విషయంలో విపక్షాలు విడిపోతున్నాయా? అంటే అవునని సమాధానం వస్తుంది.. గతంలో ముక్తకంఠంతో ‘ఇండియా కూటమి’లోని అన్ని పార్టీలు వ్యతిరేకించాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్ బిల్లుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించింది. ఈ రోజు ఉదయం పార్టీ ఎంపీలతో సమావేశమైన డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి ఊరటనివ్వడంతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియకు మార్గం సుగమం చేయనుంది.

కేంద్రం అంగీకరించిన డీఎంకే ప్రధాన డిమాండ్
డీలిమిటేషన్ ప్రక్రియలో అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలన్నది డీఎంకే ప్రధాన డిమాండ్. ముఖ్యంగా తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గకూడదని ఆ పార్టీ స్పష్టం చేస్తూ వచ్చింది. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమైంది. తాజాగా ప్రతి రాష్ట్రంలోనూ ఎంపీ స్థానాలను 50 శాతం పెంచాలన్న కేంద్రం ప్రతిపాదన తమ అభ్యంతరాలను పరిష్కరించిందని డీఎంకే నేతలు తెలిపారు.

ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపు
పార్టీ ఎంపీల సమావేశం అనంతరం డీఎంకే ఎంపీ దయానిధి మారన్ కేంద్రం ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ పార్లమెంట్ స్థానాలను 50 శాతం పెంచాలన్న నిర్ణయం తమ డిమాండ్‌కు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. దీనివల్ల మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఏర్పడుతుందని తెలిపారు. తమ డిమాండ్ నెరవేరినందున బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు.

తమిళనాడుకు 7.18 శాతం వాటా కొనసాగాలి
డీఎంకే నిర్ణయంపై ఎంపీ ఏ. రాజా మరింత స్పష్టత ఇచ్చారు. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం పార్లమెంటరీ ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకూడదనే హామీ ఆధారంగానే బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విషయంలో 59 స్థానాల సంఖ్యపై అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించారు. అవసరమైతే మరిన్ని సవరణలు ప్రతిపాదించే పూర్తి అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు తమకు ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ కూటమిలో భాగంగా ఉన్న సమయంలో కూడా ఇదే డిమాండ్‌ను ముందుకు తీసుకొచ్చిందని ఏ. రాజా గుర్తుచేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలని, తమిళనాడు ప్రయోజనాలు కాపాడాలని డీఎంకే మొదటి నుంచి కోరుతోందని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కీలక పరిణామం
డీలిమిటేషన్ అంశం కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు ప్రతిపక్ష పార్టీలకు మధ్య వివాదానికి కారణమైంది. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభలో వాటి ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ప్రయోజనాలకు భరోసా లభించడంతో డీఎంకే తన వైఖరిలో కీలక నిర్ణయం తీసుకుంది.