కర్ణాటకలో ప్రస్తుతం కుల సర్వే నడుస్తోంది. వెనుకబడిన తరగతుల కమిషన్ చేపట్టిన సామాజిక-ఆర్థిక సర్వే సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 7న ముగియనుంది. ఇక సర్వేలో 60 ప్రశ్నలు సంధించారు. అయితే కుల సర్వేలో ఆభరణాలపై అడిగిన ప్రశ్నకు స్వయంగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమారే నిరాకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ సందర్భంగా వివరాలు సేకరిస్తున్న వారికి పలు సూచనలు చేశారు. ఆభరణాలు, వ్యక్తిగత విషయాలు అడగొద్దని సూచించారు.
ఇది కూడా చదవండి: Marco Rubio: బందీలను విడిపించడమే లక్ష్యం.. నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు.. గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
బెంగళూరు పరిధిలో శనివారమే సర్వే ప్రారంభమైంది. సర్వేలో భాగంగా అధికారులు ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అయితే అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. వ్యక్తిగత వివరాలు అడగవద్దని అధికారులకు శివకుమార్ చెబుతున్న మాటలు వైరల్ అయ్యాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్రంగా పట్టుబట్టాయి.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నితీష్‌కుమార్ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్
డీకే.శివకుమార్ తీరును బీజేపీ, జేడీఎస్ తప్పుపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే గందరగోళంగా ఉందని విమర్శించారు. సరైన కసరత్తు లేకుండా.. హడావుడిగా సర్వే చేపట్టారని ధ్వజమెత్తాయి. ఇందుకు డీకే.శివకుమార్ తీరే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రజలను 60 ప్రశ్నలు అడగడమేంటి? అని నిలదీశారు. అన్ని వర్గాల్లో అశాంతి నెలకొందని బీజేపీ చీఫ్ బీవై.విజయేంద్ర వ్యాఖ్యానించారు. ముందస్తు కసరత్తు లేకుండా ప్రభుత్వం తొందరపడి సర్వేను ప్రారంభించిందని ఆరోపించారు. దివ్యాంగులతో సర్వే చేయించడమేంటి? అని నిలదీశారు. ప్రభుత్వం ఎందుకు తొందరపడి సర్వే నిర్వహిస్తుందో అర్థం కావడం లేదన్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఏదైనా మార్పులు జరగొచ్చా? అని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చలు జరుగుతున్నాయని.. అలాగే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని విజయేంద్ర పేర్కొన్నారు.
ప్రతిపక్షాల విమర్శలపై డీకే.శివకుమార్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజలకు ఎన్ని కోళ్లు, గొర్రెలు, బంగారు వస్తువులు, గడియారాలు, ఇతర వ్యక్తిగత ఆస్తులు ఉన్నాయనే దాని గురించి ప్రశ్నలు అడగవద్దని నేను అధికారులను ఆదేశించాను. వ్యక్తిగత ప్రశ్నలను కూడా అడగవద్దని నేను వారికి చెప్పాను. వారు సర్వేను ఎలా నిర్వహిస్తారో చూద్దాం. ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఎటువంటి కారణం లేదు. మునుపటి సర్వేపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందుకే మేము కొత్త సర్వే నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. అందరూ తప్పనిసరిగా పాల్గొనాలి.’’ అని శివకుమార్ పేర్కొన్నారు.