DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు

  • ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు
  • విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
  • రాష్ట్రవ్యాప్తంగా 10,000 భారత్ జోడో క్లబ్‌లు ఏర్పాటు
Dkshivakumar8

Dkshivakumar8

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అలాగే 13 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తానికి బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ తొలి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత బస్ పాస్‌లు, భారత్ జోడో క్లబ్‌లు ప్రకటించారు.

యువత అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా భారత్ జోడో యువజన క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు డీకే.శివకుమార్ ప్రకటించారు. ప్రతి క్లబ్‌కు ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10,000 భారత్ జోడో క్లబ్‌లు ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించారు.

×
×
Ad

విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్


ఇక విద్యార్థులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. ఇప్పటివరకు బాలికలకు మాత్రమే ఉన్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని.. ఇకపై పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్‌లు అందించనున్నట్లు ప్రకటించారు. “అన్ని స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచిత బస్ పాస్‌లు ఇస్తాం. ఇది డీకే శివకుమార్ మంత్రివర్గం తీసుకున్న తొలి నిర్ణయం” అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.. రవాణా శాఖతో చర్చించి పూర్తి మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు


రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకులు ప్రభుత్వ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. వారి అర్హతలకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలతో చర్చించి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా


యువత దృష్ట్యా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని డీకే శివకుమార్ చెప్పారు. “ఈ రాష్ట్ర ప్రజలు నాపై అపారమైన నమ్మకం ఉంచారు. గతంలో నన్ను విమర్శించి ఉండవచ్చు, ప్రశంసించి ఉండవచ్చు. రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు, సంతోషాలు చూశాను. చిన్న వయసులోనే అధికారాన్ని కూడా అనుభవించాను. ఇప్పుడు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం” అని డీకే. శివకుమార్ పేర్కొన్నారు. ఇక డీకే శివకుమార్ తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ నియమితులయ్యారు.