కేరళలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొచ్చిన్ కోస్ట్ గార్డ్ లక్షద్వీప్ దీవులలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. రూ.1,526 కోట్ల విలువ చేసే 218 కేజీల హెరాయిన్ సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేటుగాళ్లు విదేశాల నుండి సముద్ర మార్గం ద్వారా హెరాయిన్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు లక్షద్వీప్ దీవులలో అధికారుల బృందం మాటు వేసింది. 12 రోజుల నిరీక్షణ తరువాత రెండు బోట్లలో తరలిస్తున్న డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు.
హెరాయిన్‌ను కిలో ప్యాకెట్ల రూపంలో ప్యాకింగ్ చేసి బోటు కింది భాగంలో దాచి స్మగ్లర్లు తరలించే యత్నం చేశారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. సముద్ర మార్గం ద్వారా అధికారుల కళ్లు గప్పి భారీగా డ్రగ్స్‌ను తరలించే యత్నం చేయగా.. ఆపరేషన్ ఖోజ్ బీన్ అనే పేరుతో అధికారుల బృందం రంగంలోకి దిగింది. ప్రిన్స్, లిటిల్ జీసెస్ అనే పేరుతో కొచ్చిన్ వైపు వెళ్తుండగా బోట్లు అనుమానాస్పదంగా నిపించడంతో అధికారుల బృందం అడ్డుకుంది. బోట్లలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని డీఆర్ఐ అధికారులు తమదైన స్టైలులో విచారణ చేపట్టారు. హెరాయిన్‌ను పడవ కింది భాగంలో దాచి ఇండియాకు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు ఇక్కడికి పంపారు? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారుల సమాచారం కోసం కూపీ లాగుతున్నారు.