NTV Telugu Site icon

Isro: శ్రీహరికోట ఉండగా.. ఇస్రో కులశేఖరపట్టణంలో మరో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎందుకు నిర్మిస్తోంది.? కారణం ఇదే..

Gslv

Gslv

Isro: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం దేశంలో రెండో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కి శంకు స్థాపన చేశారు. తమిళనాడు కులశేఖరపట్టణంలో ఈ స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఇన్నాళ్లు ఇస్రో రాకెట్ ప్రయోగాలకు కేరాఫ్‌గా ఏపీలోని శ్రీహరికోట ఉంది. గత దశాబ్దాలుగా ఈ శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 700 కిలోమీటర్ల దూరంలో కొత్త స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ని చిన్న శాటిలైట్స్, లోఎర్త్ఆర్బిట్(LEO)లోకి ప్రయోగించే ఉపగ్రహాల కోసం ఉపయోగించనున్నారు.

శ్రీహరికోట అనుకూలతలు:

1970ల నుంచి శ్రీహరికోట నుంచి ఎన్నో రాకెట్ ప్రయోగాలు జరిగాయి. రాకెట్ ప్రయోగం అంటే ముందుగా గుర్తుకువచ్చేది శ్రీహరికోటనే. తూర్పు తీరంలో బంగాళాఖాతం, పులికాట్ సరస్సులకు సమీపంలో ఉన్న ఈ స్టేషన్ భౌగోళికంగా ఎంతో విశిష్టమైంది. భూమధ్య రేఖకు దగ్గర ఉండటంతో భూమి భ్రమణ వేగం రాకెట్‌కి కలిసి వస్తుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ వేగాన్ని సాధించడంతో పాటు ఎక్కువ పేలోడ్ అంతరిక్షంలోకి తీసుకెళ్లవచ్చు. సాధారణంగా భూ భ్రమణ వేగం భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా ఉంటుంది. అందుకే శ్రీహరికోట రాకెట్ లాంచింగ్‌కి మెయిన్ అడ్డాగా ఉంది.

శ్రీహరికోటకు ఉన్న ఈ సహజ లక్షణం భూమధ్యరేఖ ఆర్బిట్ ప్రయోగాలకు చక్కగా సరిపోతుంది. భూమధ్య రేఖతో సమలేఖనంలో ఉండే ఈ కక్ష్య సాధారణంగా కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లకు చక్కగా సరిపోతుంది. సముద్రానికి పక్కనే ఉండటంతో ఏదైనా ప్రయోగం విఫలమైనా రాకెట్ భాగాలు సముద్రంలో పడిపోతాయి.

ఇస్రోకి కొత్త లాంచింగ్ స్టేషన్ ఎందుకు అవసరం.?

చిన్న సైజులో, తక్కువ బరువు ఉండే శాటిలైన్లను ప్రయోగించేందుకు ఇస్రో కులశేఖర పట్టణం వద్ద కొత్త లాంచింగ్ స్టేషన్ నిర్మిస్తోంది. శ్రీహరికోట భారీ బరువు ఉండే శాటిలైట్ల ప్రయోగానికి సరిపోతే, కులశేఖరపట్టణం చిన్న పేలోడ్‌లకు సరిపోతుంది. ముఖ్యంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) మరియు 500 కిలోల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(SSLV) వంటి ప్రయోగ వాహనాలకు శ్రీహరికోట అనువుగా లేదు.

శ్రీహరికోట నుంచి ధ్రువ కక్ష్యలో రాకెట్లను ప్రయోగిస్తే అవి శ్రీలంక పై నుంచి ఎగరాల్సి వస్తోంది. దీంతో ఇది భద్రతా, జియోపాలిటిక్స్ పరంగా సమస్యగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎస్ఎస్ఎల్వీ వంటి రాకెట్లు ఫ్యూయల్ ఇంటెన్సివ్ మాన్యువర్స్ నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని “డాగ్-లెగింగ్” అని పిలుస్తారు.  చెప్పాలంటే రాకెట్ వెళ్తున్న మార్గాన్ని మధ్యలో మార్చడం.

అంతరిక్ష నౌకను ప్రయోగించే దిశను ‘అజిముత్’ అని పిలుస్తారు. జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్(GSLV)ని 104 డిగ్రీలు-107 డిగ్రీల మధ్య అజిముత్ వద్ద ప్రయోగిస్తారు. ఇది బంగాళాఖాతం మీదుగా వెళ్లేందుకు అనుమతిస్తుంది. మరోవైపు పీఎస్ఎల్వీ ధ్రువ కక్ష్య ఉపగ్రహాల ప్రయోగాలను 140 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ అజిముత్ వద్ద ప్రయోగిస్తారు. ఇలా ప్రయోగించేవి శ్రీలంక మీదుగా వెళ్లకుండా దిశలో కొంచెం మార్పు అవసరం. ఈ సమస్యను పరిష్కరించేందుకు కులశేఖరపట్టణం చాలా అనువుగా ఉంటుంది. అందుకే భారత్ ఈ కొత్త లాంచింగ్ స్టేషన్ నిర్మిస్తోంది.