Congress Presidential Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ముందు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసులో ముందుంటారని భావించినప్పటికీ.. ఊహించని విధంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్‌లు బరిలో ఉన్నారని తెలిసిందే. కానీ అనూహ్యంగా పోటీ నుంచి దిగ్విజయ్ సింగ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ మల్లిఖార్జున ఖర్గే బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం శశిథరూర్, మల్లిఖార్జున ఖర్గే పోటీలో నిలిచినట్లు స్పష్టం అవుతోంది. ఇవాళ నామినేషన్ దాఖలుకు చివరి తేదీ కాగా.. వీరిద్దరు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
గాంధీ కుటుంబం విధేయుల్లో ఒకరైన ఖర్గేను బరిలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఖర్గే పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దళిత వర్గానికి చెందిన ఖర్గే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. 8 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు లోక్ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. హోంమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
School Teacher: ఆ బొమ్మలు చూపించాడు.. ఆయన మాత్రం చుక్కలు చూశాడు..
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని జీ-23 నేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు సీనియర్ నేతలు పృథ్విరాజ్ చవాన్, భూపిందర్ హుడా, మనీశ్ తివారీలు ఆనంద్ శర్మ నివాసంలో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై వీరు సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు మీరాకుమార్, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు పార్టీ సన్నిహత వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ సారి గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వారు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు.