Difficult to say real form of Ram Setu is present, says Union Minister Jitendra Singh: చాలా ఏళ్లుగా ‘రామసేతు’పై చర్చ నడుస్తూనే ఉంది. ఆడమ్స్ బ్రిడ్జ్ గా పిలవబడే ఈ నిర్మాణమే రామాయణ కాలంలో శ్రీరాముడు లంకకు నిర్మించిన వారధి అని చాలా మంది హిందువులు భావిస్తుంటారు. తమిళనాడు రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ వరకు ఈ బ్రిడ్జ్ ఉంది. ఇది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా ఉంది. అయితే ఈ అంశం తాజాగా జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. రామసేతుపై హర్యానాకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ కార్తికేయ శర్మ రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన కోసం ఆయన ప్రశ్నని లేవనెత్తారు.
అయితే ఎంపీ కార్తికేయ శర్మ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సమాధానం చెప్పారు. ‘‘సాధారణంగా చెప్పాలంటే రామసేతు అసలు రూపం అక్కడ ఉందని చెప్పడం కష్టం..అయితే అక్కడ ఉన్న సూచనలను బట్టి నిర్మాణం అక్కడ ఉండవచ్చు’’ అంటూ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వాలు రామసేతుపై ఎలాంటి శ్రద్ధ చూపలేదని.. భారతదేశ అద్భుతమైన చరిత్రపై ప్రభుత్వం ఏదైనా శాస్త్రీయ పరిశోధన చేస్తుందా..? అని ఎంపీ కార్తికేయశర్మ ప్రశ్నించారు.
Read Also: USA: అమెరికా ఆశ ప్రాణాలు తీసింది.. మెక్సికో గోడపై నుంచి జారిపడ్డ కుటుంబం.. ఒకరు మృతి
రామసేతుకు సంబంధించి ఎంపీ ప్రశ్నను లేవనెత్తడం చాలా సంతోషాన్ని ఇస్తుందని.. దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని.. ఎందుకంటే రామసేతు దాదాపుగా 18 వేల ఏళ్ల క్రితం నాటి చరిత్ర.. మనం మాట్లాడుకుంటున్న వంతెన పొడవు దాదాపుగా 56 కిలోమీటర్లని స్పేస్ టెక్నాలజీ ద్వారా సముద్రంలోని కొన్ని రాళ్లను కనుక్కున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. సింపుల్ గా చెప్పాలంటే రామసేతు అసలు రూపం అక్కడ ఉందని చెప్పడం కష్టం.. అయితే అక్కడ నిర్మాణం ఉండవచ్చని సూచించే విధంగా నిర్మాణం ఉందని అన్నారు. పురాతన ద్వారక నగరాన్ని కూడా కనుక్కునేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా బీజేపీపై విమర్శలు గుప్పించారు. భక్తులంతా చెవులు విప్పి వినండి.. కళ్లు తెరిచి చూడండి.. రామసేతు ఉందనడానికి రుజువు లేదని పార్లమెంట్ లో మోదీ ప్రభుత్వ చెబుతోందని విమర్శించారు.