Asaduddin Owaisi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 5 స్థానాలను గెలుచుకుంది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో తన ఉనికిని నిరూపించుకుంది. అయితే, ఈ గెలుపుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం సీమాంచల్ ఓటర్లకు థాంక్స్ చెప్పారు. ఈ తీర్పు సీమాంచల్ ప్రాంతంలో పార్టీ తన ఉనికిని పునరుద్ఘాటించిందని అన్నారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘మా ఐదుగురు అభ్యర్థుల్ని మళ్లీ గెలిపించినందుకు సీమాంచల్ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను… మేము 11 సంవత్సరాల క్రితం సీమాంచల్ కోసం ఈ పోరాటాన్ని ప్రారంభించాము, మేము ఇప్పటికీ సీమాంచల్‌కు న్యాయం కోసం పోరాడుతున్నాము.’’ అని అన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి మాట్లాడిన ఓవైసీ.. గెలిచినందుకు నవీన్ యాదవ్‌కు అభినందనలు తెలిపారు. బీహార్ విజయంపై తనను సీఎం రేవంత్ రెడ్డి అభినందించినట్లు వెల్లడించారు.
Read Also: Bihar MLAs Assets: బీహార్ లో 90% మంది కొత్త ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. లిస్ట్ లో ఎవరున్నారంటే?
ఇదిలా ఉంటే, బీహార్‌లో బీజేపీ – జేడీయూల కూటమి గెలవడంపై ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్డీయే కూటమి గెలుస్తుందని నేను అనుకున్నాను. కానీ 200 గెలుస్తుందని అనుకోలేదు. బీహార్ ప్రజల తీర్పును మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి. నేను నితీష్ కుమార్‌ను అభినందిస్తున్నాను. నితీష్ కుమార్ సీమాంచల్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలనుకుంటే, మా నిర్మాణాత్మక సహకారం ఉంటుంది’’ అని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 202 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ ,ఆర్జేడీల మహా ఘట్బంధన్ కూటమి కేవలం 35 సీట్లకే పరిమితమైంది.