బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ) అబుదాబి వెళ్తున్న ఎయిర్ అరేబియా విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో సోమవారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం రెండు ఇంజిన్లలో ఒకటి ఆకాశంలో విఫలం అవ్వడంతో సిబ్బంది ‘ మేడే’ ప్రకటించి అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంగళవారం విచారణకు ఆదేశించింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తో ప్రాథమిక దర్యాప్తు జరుగుతుందని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
చిట్టగాంగ్ నుంచి అబుదాబి బయలుదేరిన ఎయిర్ అరేబియా 3ఎల్-062, ఎయిర్ బస్ ఏ320 విమానం భారత గగనతలంలో ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండు ఇంజిన్లలో ఒకటి నిలిచిపోవడంతో సిబ్బంది ఎమర్జెన్సీ డిక్లర్ చేసింది. వెంటనే మేడే ప్రకటించి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సిబ్బంది ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ముంబై నుంచి ఏఏఐబీ టీం అహ్మదాబాద్ కు వెళ్లింది.