Allahabad HC: కారణం లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారాన్ని నిరాకరించడం మానసిక క్రూరత్వమే అని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన కారణాలు లేకుండా సెక్స్ కు దూరం పెట్టడం మానసిక క్రూరత్వంతో సమానం అని కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. కుటుంబ న్యాయస్తానం తనకు విడాకుల పిటిషన్ ను కొట్టివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి చేసిన అప్పీల్ పై హైకోర్టు విచారించింది. ఫ్యామిలీ కోర్టు అనుసరించిన విధానం ‘హైపర్ టెక్నికల్’ అని హైకోర్టు పేర్కొంది. చాలా కాలంగా భార్యభర్తలు విడివిడిగా జీవిస్తున్నట్లు రికార్డుల ద్వారా అర్థం అవుతోందని, వివాహ బాధ్యతను నిర్వర్తించడానికి భార్య తిరస్కరించిందని కోర్టు పేర్కొంది.
Read Also: Kanpur: 100 ఏళ్లు నిండాయి.. ఇదేం పని.. వృద్ధురాలిపై పోలీసుల కేసు..
కేసు ఇది..
ఓ జంట 1979లో వివాహం చేసుకున్నారు. ఏడేళ్ల తర్వాత భార్యభర్తలు గౌన కార్యక్రమం( ఉత్తరాదిలో పెళ్లి తర్వాత కొన్ని రోజులకు నిర్వహించే కార్యక్రమం, ఈ కార్యక్రమం తర్వాత దంపతులుగా జీవించడం ప్రారంభం అవుతుంది) నిర్వహించిన తర్వాత దంపతులుగా జీవించడం ప్రారంభించారు. అయితే భార్య తన వివాహ బాధ్యతను నెరవేర్చడానికి నిరాకరించి, తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఆమెను ఒప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని భర్త పేర్కొన్నారు. మహిళ తన భర్తతో ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోలేదు. జూలై 1994లో ఆ వ్యక్తి తన భార్యకు రూ. 22,000 భరణం చెల్లించిన తర్వాత పంచాయతీ ముందు దంపతులు పరస్పరం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో లీగల్ గా విడాకులు పొందేందుకు భర్త మానసిక క్రూరత్వం, తనను విడిచిపెట్టిన కారణంగా విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అయితే క్రూరత్వం కారణంగా విడాకులు ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. ఆయన విడాకుల అభ్యర్థనను కొట్టివేసింది కుటుంబ న్యాయస్థానం. తాజాగా అలహాబాద్ హైకోర్టులో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సవాల్ చేశారు.
న్యాయమూర్తులు సునీత్ కుమార్ మరియు రాజేంద్ర కుమార్-4లతో కూడిన ధర్మాసనం గురువారం భర్తకు విడాకులను మంజూరు చేసింది. తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామి తన భర్త/ భార్యతో ఎక్కువ కాలం లైంగిక సంబంధం పెట్టుకోకుండా ఉండకూడదు. ఇది క్రూరత్వానికి సమానం అని పేర్కొంది.