Site icon NTV Telugu

Delimitation Row: వైఫల్యాలను కప్పిపుచ్చడానికే స్టాలిన్ వ్యూహం.. బీజేపీ విమర్శలు..

Delimitation Row

Delimitation Row

Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిలేషన్)పై చెన్నై వేదిక తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సమావేశానికి స్టాలిన్ అధ్యక్షత వహించగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం భవంత్ మాన్, టీఆర్ఎస్ నేత కేటీఆర్ వంటి వారు హాజరయ్యారు. మొత్తంగా ఈ సమావేశానికి 5 రాష్ట్రాల నుంచి 14 మంది నాయకులు పాల్గొన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారంతా ఆరోపించారు. దక్షిణాదిని అణగదొక్కాలని బీజేపీ భావిస్తోందని సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు.

Read Also: Putin: ట్రంప్ కోసం చర్చిలో పుతిన్ ప్రార్థనలు.. కారణం ఏంటంటే..

ఇదిలా ఉంటే, సీఎం స్టాలిన్‌ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నల్లజెండాలతో బీజేపీ నిరసన తెలియజేసింది. కర్ణాటక, కేరళతో కావేరి, ముల్లపెరియార్ నీటి పంపిణీపై ఇలాంటి సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని సీఎం స్టాలిన్‌ని బీజేపీ ప్రశ్నించింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తమ తప్పులను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు బీజేపీ నేత తమిళిసై సౌందర్‌రాజన్ ఆరోపించారు. డీఎంకే అవినీతి, వినాశకరమైన దుష్ప్రవర్తన నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి విభజన వ్యూహంగా డీఎంకే ఈ డీలిమిటేషన్ డ్రామాను ప్రదర్శిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ అన్నారు.

‘‘డీలిమిటేషన్ ప్రకటించలేదు, కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదు, హోం మంత్రి అమిత్ షా కోయంబత్తూర్ కు వచ్చారు. తమిళనాడు ప్రభావితం కాదని స్పష్టం చేశారు. కాబట్టి మీరు ఈ సమావేశాన్ని ఏ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.’’ తమిళిసై డీఎంకేని ప్రశ్నించారు. అవినీతిని దాచడాని, దేశ ప్రజల్ని విభజించడానికి ఈ సమావేశం జరుగుతోందని, సీఎంలు తమ రాష్ట్రాల్లో దుష్పరిపాలనను దాచడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, కేరళ ప్రభుత్వాలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

Exit mobile version