NTV Telugu Site icon

Delhi Assembly: అసెంబ్లీలోకి బీజేపీ ప్రభుత్వం రానివ్వడం లేదు.. ఆప్ సంచలన ఆరోపణలు

Atishi

Atishi

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల వేదికగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి వాడీవేడీగానే జరుగుతోంది. ఇటీవల గత ప్రభుత్వ పాలనపై కాగ్ రిపోర్టును ముఖ్యమంత్రి రేఖా గుప్తా సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో అతిషి సహా 21 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ విజేందర్ గుప్తా.. మూడు రోజులు సస్పెండ్ చేశారు. అయితే గురువారం సభలోకి వెళ్లేందుకు ఆప్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. బారికేడ్లు అడ్డుపెట్టి రానివ్వకుండా చేశారని అతిషి ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. స్పీకర్ అనుమతి లేకుండా లోపలికి అనుమతించబోమని పోలీసులు తెలిపారు.

బీజేపీ అధికారంలోకి రాగానే నియంతృత్వం హద్దులు దాటేసిందని అతిషి ఆరోపించారు. సభలో జై బీమ్ నినాదాలు చేసినందుకు మూడు రోజుల పాటు ఆప్ ఎమ్మె్ల్యేలను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏకంగా సభలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని.. ఇలాంటి దారుణం ఎన్నడూ చూడలేదని అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల బీజేపీ ప్రభుత్వం 2021-2022లో ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ కారణంగా రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కాగ్ రిపోర్టును బయటపెట్టింది. అయితే ఈ రిపోర్టును ఆప్ ఖండించింది.

ఇది కూడా చదవండి: IPL 2025 MS Dhoni: మొదలైన ఐపీఎల్ సందడి.. చెన్నైలో అడుగుపెట్టిన మిస్టర్ కూల్

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను గెలుచుకున్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నేతలంతా ఓటమి పాలయ్యారు. లిక్కర్ స్కామ్ భారీగా పార్టీని నష్టపరిచింది.

ఇది కూడా చదవండి: Posani KrishnaMurali Arrest: ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసాని.. కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టుకు!