2020 Delhi Riots Case: తాహిర్ హుస్సేన్‌కు ఉరిశిక్ష విధించాలి.. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు..

  • తాహిర్ హుస్సేన్‌కు ఉరిశిక్ష విధించాలి..
  • 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ అధికారి దారుణహత్య..
  • తాహిర్‌తో పాటు సహ నిందితులు కసాయివాళ్లుగా మారారు..
  • మరణశిక్ష విధించాలని కోరిన ఢిల్లీ పోలీసులు..
Tahir Hussian

Tahir Hussian

2020 Delhi Riots Case:  2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ అధికారి అంకిత్ శర్మను దారుణంగా హత్య చేశారు. అతడి ఒంటి నిండా కత్తి గాయాలతో, ఢిల్లీలోని ఒక నాలాలో శవంగా తేలారు. ఈ కేసులో ఆప్ మాజీ కార్పొరేటర్, అల్లర్లలో ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్న తాహిర్ హుస్సేన్‌తో పాటు ఇతర నిందితులకు మరణశిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టులో వాదించారు. దాడి చేసిన వారి వల్ల అంకిత్ శర్మ శరీరంపై 51 తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంతటి అమానుషమైన, క్షమించరాని నేరానికి పాల్పడిన వారందరికీ మరణశిక్ష మాత్రమే విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టుకు గట్టి వైఖరితో తెలిపారు.

శిక్ష విధింపుపై ఢిల్లీ పోలీసులు తరుఫున న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. నేరం జరిగిన సమయంలో నిందితులు కసాయివాళ్లుగా మారిపోయారని కోర్టుకు తెలిపారు. దీనిని పోలీసులు క్రూరమైన హత్యగా అభివర్ణించారు. అంకిత్ శర్మ మరణం తర్వాత కూడా నిందితులు అతడి శరీరంపై దారుణంగా దాడి చేశారని అన్నారు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, అతను లోదుస్తులు మినహా మరే దుస్తులు లేకుండా కనిపించాడు.

అంకిత్ శర్మపై జరిగిన క్రూరమైన హత్యను పోలీసులు కోర్టుకు వివరించారు. పోస్టుమార్టం నివేదికలో అతడి శరీరంపై 51 గాయాలు ఉన్నాయని, వీటిలో ఏడు గాయాలు స్వయంగా మరణానికి కారణమయ్యేంత తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. పదునైన ఆయుధాలతో 16 గాయాలు చేశారని, పదునైన ఆయుధాలు ఉపయోగించడం ఈ నేరంలో క్రూరత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని పోలీసులు తెలిపారు.