ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం అవుతోంది. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పేరును ప్రకటించలేదు. దీంతో ఆశావాహులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎవరికీ ఢిల్లీ పీఠం దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చాకే.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది తేలుతుంది. అప్పటి వరకు సస్పెన్ష్ కొనసాగనుంది. అయితే ఫిబ్రవరి 19-20 తేదీల్లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉండొచ్చని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్ర విషయంలో కూడా ఇలానే జరిగింది. దేవేంద్ర ఫడ్నవిస్ ఎంపికకు దాదాపు రెండు వారాల సమయం పట్టింది. ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి కూడా అలానే ఉంది.
ఇది కూడా చదవండి: ACB: రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీపీఓ శ్యామ్ సుందర్..
మోడీ అమెరికా నుంచి రాగానే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. దీనికి పరిశీలకులను నియమించనుంది. మహారాష్ట్ర విషయంలో కూడా ఇద్దరు పరిశీలకులను నియమించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని నియమించింది. ఢిల్లీ సీఎం ఎంపికకు కూడా ఇద్దరు బీజేపీ సీనియర్లను నియమించనుంది.
ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడగానే స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పౌర మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఫిబ్రవరి 20 నాటికి మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఆ నేతలు పేర్కొంటున్నారు. ఇక కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎంపిక చేయొచ్చన్న వార్తలను కొట్టిపారేస్తున్నారు. అనుభవజ్ఞులకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రధానంగా కేజ్రీవాల్‌పై గెలిచిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేకాకుండా దళిత మహిళను సీఎంగా ఎంపిక చేయొచ్చన్న ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. ఇక తొలి కేబినెట్ భేటీలోనే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకంపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Oh Bhama Ayyo Rama: వాలెంటైన్స్ డే స్పెషల్.. ‘ఓ భామ అయ్యో రామ’ పోస్టర్ విడుదల..
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి అగ్ర నేతలంతా ఈ సారి ఓడిపోయారు. ఒక్క అతిషి మాత్రం కల్కాజ్ నియోజకవర్గం నుంచి అతి కష్టం మీద గట్టెక్కారు.
ఇది కూడా చదవండి: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌కు తీవ్ర అస్వస్థత.. రోమ్ ఆస్పత్రికి తరలింపు