పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే దంపతులు తప్పనిసరిగా ఒక సంవత్సరం పాటు విడివిడిగా జీవించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం, 1955 కింద ఉన్న ఈ నిబంధనను నిజమైన మరియు అసాధారణ పరిస్థితుల్లో మినహాయించవచ్చని కోర్టు పేర్కొంది. భార్యాభర్తలను అనవసరంగా ఇష్టంలేని సంబంధంలో కొనసాగించాల్సిన అవసరం లేదని జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అనుప్ జైరామ్ భంబానీ, జస్టిస్ రేణు భట్నాగర్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B(1) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం పాటు విడిగా ఉండటం చట్టపరమైన నిబంధన మాత్రమే తప్ప, అది తప్పనిసరి కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. సంబంధం పట్ల అసంతృప్తిగా ఉన్న.. దానిని కొనసాగించేందుకు ఆసక్తి లేని వ్యక్తులను బలవంతంగా వివాహ బంధంలో కొనసాగించాల్సిన బాధ్యత కోర్టుకు లేదని బెంచ్ ప్రశ్నించింది.
అయితే, సెక్షన్ 13B(2) కింద రెండవ విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి అవసరమైన ఆరు నెలల “కూలింగ్-ఆఫ్” వ్యవధికి ఒక సంవత్సరం విడిపోయే నిబంధన మినహాయింపు వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. ఈ రెండు వ్యవధులను వేర్వేరుగా, స్వతంత్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేవలం అభ్యర్థన ఆధారంగా మాత్రమే ఒక సంవత్సరం విడిపోయే నిబంధనకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. పిటిషనర్ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారని లేదా ప్రతివాది నుంచి అసాధారణమైన దుర్వ్యవహారం చోటుచేసుకున్నట్లు కోర్టు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే ఆ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొంది. ఇలాంటి మినహాయింపును కుటుంబ కోర్టు లేదా హైకోర్టు రెండూ మంజూరు చేయవచ్చని కూడా ధర్మాసనం తెలిపింది.
అదేవిధంగా, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 14(1) ప్రకారం, సెక్షన్ 13B(1) కింద ఒక సంవత్సరం మినహాయింపు తప్పుడు వాస్తవాలు లేదా కారణాల ఆధారంగా పొందినట్టు తేలితే, కోర్టు విడాకుల అమలు తేదీని తగిన విధంగా పొడిగించే అధికారం కలిగి ఉంటుందని ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. అటువంటి పరిస్థితుల్లో, పెండింగ్‌లో ఉన్న విడాకుల పిటిషన్‌ను దాని దశతో సంబంధం లేకుండా వెంటనే కొట్టివేయవచ్చని కూడా స్పష్టం చేసింది.