Jantar Mantar: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నగరం నడిబొడ్డున నిరసనలు నిర్వహించడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, మొత్తం ఢిల్లీని బందీగా ఎందుకు మార్చాలి.? అని ప్రశ్నించింది. జస్టిస్ అమిత్ మహాజన్, ‘‘ వ్యక్తిగతంగా చూస్తే నగరంలో ఇలాంటి నిరసనలు జరగకూడదు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే’’ అని అన్నారు. శాంతిభద్రతల నిర్వహణ పోలీసుల పరిధిలో ఉంటుందని, అనుమతిపై తాము ఆదేశాలు ఇవ్వలేని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ దరఖాస్తుపై శనివారం లోగా నిర్ణయం తీసుకని, ఈ విషయాన్ని తెలియజేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది.
కేసు ఏమిటి..?
ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆగస్టు 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసుల్ని అనుమతి కోరింది. జూలై 9 నుంచి అనుమతి రాకపోవడంతో వీరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేంద్రం తరుఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున జంతర్ మంతర్ వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ, దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని తమ డిమాండ్‌కు మద్దతుగా ఈ నిరసన చేపట్టాలని భావిస్తోంది.
సుప్రీంకోర్టుకు చేరిన జంతర్ మంతర్ అంశం:
మరోవైపు, జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆగస్టు 3న సుప్రీంకోర్టు కూడా జంతర్ మంతర్‌ను నిరసనలు జరిపే ప్రాంతంగా ఉంచాలా వద్దా అనే దానిపై దాఖలైన పిల్‌ను విచారించనుంది. నిరసనల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, అత్యవసర సేవలకు ఆటంకం వాటిల్లుతోందని పిటిషన్ పేర్కొంది.

