Four minors killed the shop owner over Rs.500 issue: వయలెన్స్ ఫ్యాషన్ గా మారింది కొందరికి. నేర ప్రపంచంలో పెద్ద పేరు సంపాదించాలని చూసిన నలుగురు మైనర్ యువకులు కటకటాల పాలయ్యారు. ఏకంగా ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. కేవలం మురికిగా ఉన్న రూ. 500 నోటు ఇవ్వడంతో షాప్ యజమానికి, నలుగురు మైనర్లకు అయిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీ భజన్ పురాలో చోటు చేసుకుంది.
గతంలో ఆ ప్రాంతంలోని ఓ దుకాణం నుంచి సరుకులు కొనుగోలు చేయడానికి రూ.500 నోటు ఇవ్వగా.. అది పాతగా, మురికిగా ఉండటంతో షాప్ యజమానికి, మైనర్ యువకులకు వాగ్వాదం జరిగింది. దీన్ని మనసులో ఉంచుకుని ఎలాగైనా బుద్ధి చెప్పాలని గురువారం షాప్ యజమానిని నలుగురు మైనర్ యువకులు పొడిచి చంపారు.
Read Also: Kerala Savari: కేరళ ప్రభుత్వ వినూత్న నిర్ణయం.. సొంతగా క్యాబ్ సర్వీస్ ప్రారంభం
గురువారం రాత్రి భజన్ పురాలోని సుభాష్ మొహల్లాలో దుకాణం యజమాని షానవాజ్ ను కత్తితో పొడిచి హత్య చేశారు నలుగురు మైనర్లు. పోలీసులు వెళ్లే సరికే బాధితుడు షానవాజ్ అపస్మారస్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించే సమయానికే ఆయన మరణించారు. అయితే హత్య చేసిన ప్రాంతం నుంచి స్కూటీపై నలుగురు యువకులు పారిపోతుండటాన్ని పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. వీరిని వెంబడించిన పోలీసులు నలుగురు మైనర్లను యూపీలోని భోపురా బోర్డర్ లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కత్తిని, స్కూటీని రికవరీ చేసుకున్నట్లు డీసీపీ సంజయ్ కమార్ సైన్ తెలిపారు.
నేర ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించేందుకు ఈ నలుగురు మైనర్లు ఇలా చేశారని పోలీస్ విచారణలో తేలింది. హత్యకు ఒక రోజు ముందు బుధవారం భజన్ పురాలోని షానీ బజార్ రోడ్డులో తుపాకీని చూపించి స్కూటీని దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు 20 రోజుల ముందు షాప్ యజమాని షానవాజ్ తో ఈ నలుగురు మైనర్లకు రూ. 500 నోటు విషయంలో గొడవ జరిగింది.