ఢిల్లీ ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇప్పటికి 27 మంది మృతి చెందారు. మరోవైపు మిస్సైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 గురు పురుషులు కాగా… 24 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మరనించిన 27 మందిలో కేవలం ఇద్దరిని మాత్రమే గుర్తించారు అధికారులు. మిగతా వారిని గుర్తించేందుకు ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. 25 మంది డీఎన్ఏ సాంపిళ్లను కలెక్ట్ చేశారు.
ఇదిలా ఉంటే తమవారు కనిపించడం లేదంటూ అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే బిల్డింగ్ యజమానులు హరీష్ గోయల్, వరుణ్ గోయల్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ముండ్కా అగ్ని ప్రమాదంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ భవనం నుంచి పొగులు వస్తూనే ఉన్నాయి. ప్రమాదస్థలిని ఢిల్లీ సీఎం సందర్శించారు. ప్రమాదంపై మెజిస్ట్రేట్ తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణం అయిన వారిని ఎవరిని వదిలిపెట్టం అని విచారణ నిర్వహించి బాధ్యులను తేలుస్తామని, బిల్డింగ్ పర్మిషన్లలో అధికారుల ప్రమేయం ఉన్నా ఉపేక్షించం అని ఢిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ డీసీపీ సమీర్ శర్మ అన్నారు.
అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో 50 మందితో బిల్డింగ్ లోని ఓ ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుందని… దీంతో వీరంతా ట్రాప్ అవడంతో ప్రమాదంలో మరనించిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం సీసీ కెమెరాలు, రౌటర్ల్ కు వాడే ప్లాస్టిక్ మెటీరియల్ ఉండటంతో మంటలు సులువుగా వ్యాపించినట్లు తెలుస్తోంది.