ఢిల్లీలో ముండ్కా అగ్ని ప్రమాదం మరవక ముందే మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముండ్కాలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మరణించగా…మరో కొంత మంది ఆచూకీ గల్లంతైంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని నరేలా లోని ఓ ప్లాస్టిక్ గ్యాన్యులేషన్ ఫ్యాక్టరీలో శనివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరి పెద్ద ప్రమాదం ఏర్పడకుండా రక్షించారు. ఇది మీడియం కేటగిరీ అగ్ని ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు. రాహుల్ జైన్ అనే వ్యక్తికి సంబంధించిన ఫ్యాక్టరీగా అధికారులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీ మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. టార్పలిన్ల తయారీకి వాడే ప్లాస్టిక్ గ్యాన్యుయల్స్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
నరేలా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 22 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అగ్నిమాపక సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని.. ప్రస్తుతం బయట నుంచే మంటలను ఆర్పేస్తున్నామని.. మరో కొన్ని గంటల్లో మంటలు అదుపులోకి వస్తాయని ఢిల్లీ అగ్నమాపక ఏడీఓ ఏకే వర్మ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే వరస అగ్నిప్రమాదాలతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జరిగిన ముండ్కా అగ్ని ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా అందర్ని కలిచివేసింది. ఏకంగా 29 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఢిల్లీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. పలువురి ఆచూకీ ఇంకా లభించలేదు. శవాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ కెమెరాలు, రౌటర్లు తయారు చేసే ఓ మూడు అంతస్తుల భవనంలో ప్రమాదం జరిగింది. ప్రజలు తప్పించుకుపోవడానికి కూడా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మరణించిన వారికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు పరిహారం అందించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం మరణించిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారంగా ప్రకటించింది.