Land-For-Jobs Case: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, వీరి కుమారుడు, ప్రస్తుత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ వారిపై దాఖలైన ఛార్జిషీట్ ని పరిగణలోకి తీసుకున్నారు. అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతో సహా పలు నేరాలను ప్రాథమిక సాక్ష్యాలు చూపించాయని అన్నారు. నిందితులను అరెస్ట్ చేయకుండా చార్జిషీటు దాఖలు చేశారని పేర్కొంటూ అక్టోబర్ 4న తమ ముందు హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు.
Read Also: Chandrayaan 3: ల్యాండర్, రోవర్ నుంచి నో సిగ్నల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఏమన్నారంటే..?
ఇటీవల ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ని విచారించేందుకు అవసరమైన అనుమతులను పొందినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ జూలై 3న ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుతో పాటు దాణా కుంభకోణంలో లాలూ యాదవ్ బెయిల్ పై బయట ఉన్నారు. ప్రస్తుతం సీబీఐ ఈ కేసులో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి దాంట్లో తేజస్వీ యాదవ్ ని నిందితుడిగా పేర్కొంది. లాలూ, రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ తో పాటు మరో 14 మందిని సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది.
2004-2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జబల్ పూర్ రైల్వేలోని వెస్ట్ సెంట్రల్ జోన్ లో జరిగిన గ్రూప్-డీ నియమకాల్లో అవకతవకలకు పాల్పడ్డాడు. ఉద్యోగానికి, భూమి ఇవ్వడం ద్వారా పలువురు అక్రమంగా ఉద్యోగాలు పొందేందుకు లాలూ ప్రసాద్ తో పాటు రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ కారణమయ్యారని అభియోగాలను ఎదర్కొంటున్నారు. మే 18, 2022లో వీరి ముగ్గురితో పాటు 15 మందిపై కేసులు నమోదయ్యాయి.