భారత్‌లో కరోనా సమయంలో తమ కుటుంబాలను, విలువైన ప్రాణాలను పక్కనపెట్టి మహమ్మారిపై ముందు నిలబడి పోరాటం చేశారు. కోట్లాదిమంది ప్రాణాలు కాపాడారు. ఈ పోరాటంలో ఎంతోమంది వైద్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్ ప్రాణాలు కోల్పోయారు. కరోనా సమయంలో విలువైన సేవలను అందించిన వైద్యులకు భారతరత్న ఇవ్వాలని ఆప్ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. దేశంలో అత్యున్నత పురస్కారం కరోనా సమయంలో సేవలు అందించిన వైద్యులందరికీ దక్కాలని, అవసరమైతే నిబంధనల్లో మార్పులు చేయాలని కేజ్రీవాల్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Read: మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఇలా చేయండి…
ఫలానా వ్యక్తికి అని కాకుండా కరోనా సమయంలో పోరాటం చేసిన ఫ్రంట్‌లైన్ వారియర్స్ అందరికీ ఈ పురస్కారం చెందాలని అన్నారు. అప్పుడే వారి సేవలను గుర్తించినట్టు అవుతుందని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే, ఐఎంఏ ప్రకటించిన వివరాల ప్రకారం, సెకండ్ వేవ్ సమయంలో దేశంలో మొత్తం 789 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోగా, ఒక్క ఢిల్లీలోనే 128 మంది వైద్యులు మృతిచెందారు. ఇలాంటి మహమ్మారులు విజృంభించినపుడు వైద్యులే పెద్దదిక్కుగా ఉంటారని, వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత, వారికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేజ్రీవాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.