Delhi Civic Polls Today: బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కోసం అంతా సిద్ధం అయింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 250 వార్డులకు 1349 మంది పోటీలో నిలబడ్డారు. 1.45 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. భద్రత కోసం మొత్తం 70 వేల మందిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు 40,000 మంది, హోమ్ గార్డులు 20,000 మందిని, ఇతర సిబ్బందిని మోహరించింది. మతపరంగా సున్నిత ప్రాంతాల్లో భద్రతను ఎక్కువగా పెంచారు. 60 డ్రోన్ కెమెరాలను సున్నిత ప్రాంతాల్లో మోహరించారు. డిసెంబర్ 7వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది.
Read Also: Jaipur: కుమార్తెను కోచింగ్కు తీసుకెళ్తుండగా గ్యాంగ్ స్టర్ కాల్పులు.. తండ్రి మృతి
గత 24 ఏళ్లుగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై గట్టి పట్టునిలుపుకుంది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 70 స్థానాలకు గానూ 67 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఆ తరువాత రెండేళ్లకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 272 సీట్లలో 181 గెలిచి ఢిల్లీ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఆప్ 48, కాంగ్రెస్ 30 స్థానాలను గెలుచుకుంది.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికలను బీజేపీ, ఆప్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉండనుంది. కాంగ్రెస్ ఉన్నా కూడా నామమాత్రపు పోటీని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా ఇటు బీజేపీ, అటు ఆప్ రెండు పార్టీలు కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. మరోసారి ఎలాగైనా బీజేపీ ఢిల్లీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అనుకుంటోంది. గత రెండు నెలల నుంచి ఇరు పార్టీలు కూడా ఢిల్లీ నగరంలో విస్తృతంగా ప్రచారం చేశాయి.