NTV Telugu Site icon

Manipur Violence: ఆరుగురి హత్యతో మణిపూర్‌లో హింస.. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్..

Manipur

Manipur

Manipur Violence: హింసాత్మక ఘటనలతో మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు. సపమ్ నిషికాంత్ సింగ్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గేటు ముందు నిర్మించిన బంకర్లను ధ్వంసం చేశారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్‌బండ్‌లోని ఎమ్మెల్యే ఆర్కే ఇమో ఇంటిపైకి అదే గుంపు దాడి చేసి ఫర్నీచర్, అద్దాలను పగులగొట్టారు.

ఇంఫాల్లో ఖ్వైరాంబండ్ కీథెల్‌లో ఆరుగురిని కిడ్నాప్ చేసి మిలిటెంట్లు హత్య చేశారు. దీంతో నిరసనలు చెలరేగాయి. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం మణిపూర్-అసోం సరిహద్దుల్లోని జిరిబామ్ జిల్లాలోని జిరిముఖ్ అనే మారుమూల గ్రామంలో నదికి సమీపంలో వీరి మృతదేహాలు శుక్రవారం సాయంత్రం కనిపించాయి. మృతదేహాలను అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కి తీసుకువచ్చి, పోస్టుమార్టం చేయించారు.

Read Also: Election Commission: అమిత్ షా, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు..

సోమవారం జిరిబామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ సమయంలో సహాయక శిబిరంలో నివసిస్తున్న ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. వారిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారని మైయిటీ వర్గం ఆరోపించింది. నవంబర్ 11న బోరోబెక్రా ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ సమయంలోనే ఆరుగురిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వీరి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు మృతదేహాలుగా కనిపించారు.

ఒకటిన్నర సంవత్సరంగా మణిపూర్‌లో కుకీ, మైయిటీ వర్గాల మధ్య జాతి హింస చోటు చేసుకుంది. మణిపూర్‌లో ఉద్రిక్తలు పెరిగాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణ కారణంగా 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.