మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా భావిస్తున్న బీజేపీ అధికారం చేజిక్కిచ్చుకునేందకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇదే కాకుండా తాజాగా శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై సీపీఐ నేత నారాయణ స్పందిస్తూ.. గొర్రెల మందలో తోడేలు లాంటిది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అంటూ ఆయన విమర్శించారు. ఖచ్చితంగా ఈడీ ఓ “బ్లాక్ షీప్” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌతు కు ఈరోజు ఈడీ నోటీసులు ఇవ్వడం అసమంజసమని, బీజేపీకి ఇలాంటి పనికిమాలిన పనులు చేయమని సంఘపరివార్, ఆర్.ఎస్.ఎస్, విశ్వహిందూ పరిషత్ చెప్పిందా..!? అని ఆయన ప్రశ్నించారు.
అస్సాంలో కూర్చుని ఎమ్మెల్యేల బలం ఉందని ఎలా చెప్తారని, ముంబాయికు వచ్చి సభలో బలాన్ని నిరూపించుకోండని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం లోఅధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు శివసేన చీలిక వర్గాన్ని ప్రోత్సహిస్తుంది…!? శివసేన లో సంక్షోభం ఉంటే వాళ్లు వాళ్లు పరిష్కరించుకుంటారు…బీజేపీకి ఎందుకు…!? బీజేపీకి నచ్చని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, చీలికలు తేవడం, అధికారంలోకి రావడానికి ఎన్నెన్నో కుట్రలు, అనైతిక చర్యలకు పాల్పడడం ఏమిటి…!? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.