కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీరం ఇనిస్టిట్యూట్ ఇఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలుగా ఉంది. అయితే ఈ వ్యవధిని 8 నుంచి 16 వారాలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
గతంలో కొవిషీల్డ్ టీకా డోసులను 12 నుంచి 16 వారాల మధ్య ఇస్తే శరీరంలో ఎంత స్థాయిలో యాంటీ బాడీలు ఉత్పన్నం అయ్యాయో.. ఇప్పుడు 8 నుంచి 16 వారాల మధ్య అంతేస్థాయిలో యాంటీ బాడీలు పెరుగుతున్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని NTAGI వెల్లడించింది. మరోవైపు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా డోసుల మధ్య గడువులో ఎలాంటి మార్పు ఉండదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ తెలిపింది. తాజా నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా 6 నుంచి 7 కోట్ల మంది ప్రజలు కొవిషీల్డ్ రెండో డోసును వేగంగా తీసుకుంటారని అధికారులు భావిస్తున్నారు. గతంలో NTAGI సిఫారసుల ఆధారంగానే కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యత్యాసాన్ని 6 నుంచి 8 వారాల నుంచి 12 నుంచి 16 వారాల వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.