Site icon NTV Telugu

Covid Vaccination: కోవిడ్ వ్యాక్సిన్-గుండెపోటు మరణాలకు సంబంధం లేదు.. ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు..

Mansukh Mandaviya

Mansukh Mandaviya

Covid Vaccination: కోవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత యువకుల్లో అనూహ్యంగా ఆకస్మిక మరణాలు పెరగడం ప్రజల్ని ఆందోళనపరిచింది. ఇలా హఠాత్తుగా ఎలాంటి అనారోగ్యం లేని యువకులు గుండెపోటులో మరణించిన కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే కోవిడ్-19 వ్యాక్సినేషన్ వల్ల భారతదేశ యువకుల్లో మరణాలు సంభవించే ప్రమాదాన్ని పెంచలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో తేలిన వివరాలను ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కి తెలియజేసింది.

లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కోవిడ్-19 కారణంగా ఆస్పత్రిలో చేరిన తర్వాత, ఫ్యామిలీ హిస్టరీలో సడన్ డెత్స్, కొన్ని జీవనశైలి కారణాలు వివరించలేదని ఆకస్మిక మరళణాల సంభావ్యతను పెంచాయని చెప్పారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్, గుండెపోటులకు మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కోవిడ్ బారిన పడిన తర్వాత కొంతమందిలో ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి. అయితే ఇలాంటి మరణాలకు కారణాలను నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. భారతదేశంలో యువకుల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ ఆకస్మిక మరణాలను పెంచలేదని చెప్పారు.

Read Also: Raja Singh: అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్ గా నియమిస్తే.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను

కోవిడ్ తర్వాత పెరుగుతున్న గుండె సంబంధ మరణాలపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. 18-45 ఏళ్లలోపు యువతతో ఆకస్మిక మరణాలపై, మే నుంచి ఆగస్టు వరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న 47 మెడికల్ కేంద్రాలలో మల్టీ సెంట్రిక్ కేస్ కంట్రోల్ అధ్యయనం చేసింది. అధ్యయనంలో వారి జీవనశైలి, మద్యం, ధూమపాన అలవాట్లు, కుటుంబ చరిత్ర, మాదకద్రవ్యాల వినియోగం, మరణాలకు రెండు రోజుల ముందు శారీరక శ్రమకు సంబంధించిన పలు అంశాలను కూడా అధ్యయనం చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ఇన్‌ఫెక్షన్, కోవిడ్ తర్వాత పరిస్థితులు ఇలా అన్నింటిని ఐసీఎంఆర్ పరిశీలించింది. ఈ అధ్యయనంలో 729 కేసులు, 2916 కంట్రోల్స్‌ని విశ్లేషించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్నా కూడా ఇలాంటి మరణాలు తగ్గాయని అధ్యయనంలో తేలింది. జీవనశైలి కారణాల వల్ల మరణాలు ముడిపడి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

Exit mobile version