Kangana ranaut: బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీ స్థానం నుంచి పోటీలో నిలబడుతున్న కంగనాపై సోషల్ మీడియా వేదికగా శ్రీనతే అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘వేశ్య’ అంటూ కామెంట్స్ చేయడంపై ఒక్కసారిగా వివాదం మొదలైంది. మరోవైపు బీజేపీ నేత దిలీప్ ఘోష్ కూడా మహిళా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
ఇలా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే, బీజేపీ నేత దిలీస్ ఘోష్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రం 5 గంటలోపు స్పందించాలని కోరింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని ఈసీ ఆదేశించింది.
Read Also: Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేపై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్యలు
సుప్రియా శ్రీనతే సోషల్ మీడియా పోస్టును తర్వాత డిలీట్ చేసి, ఈ పోస్టు తాను చేయలేదని శ్రీనతే వివరణ ఇచ్చుకున్నప్పటికీ వివాదం ముగియలేదు. తన అకౌంట్ యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని, ఎవరో తన పేరుతో ఈ పోస్ట్ చేశారని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. నేను ఎవరి పట్ల వ్యక్తిగత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయలేదని చెప్పింది.
ఇదే విధంగా బీజేపీ నేత, పశ్చిమబెంగాల్ బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. సీఎం ‘రాష్ట్ర పుత్రిక’ వాదనను ఎగతాళి చేస్తూ.. ముందు ఆమె తన తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలని అని వ్యాఖ్యానించారు. ‘‘ముఖ్యమంత్రి గోవాకు వెళ్లి నేను గోవా కుమార్తెను అని, త్రిపురలో నేను త్రిపుర కుమార్తెను అని చెప్పింది. ముందు ఆమె తన తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలి’’ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.