Saudi-Pak defence deal: సౌదీ అరేబియా పాకిస్తాన్‌తో “వ్యూహాత్మక పరస్పర రక్షణ” ఒప్పందంపై కాంగ్రెస్ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది భారత ప్రధాని నరేంద్రమోడీ దౌత్యానికి ఎదురుదెబ్బగా దీనిని అభివర్ణించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ అకస్మాత్తుగా ఆగిపోయిన నెల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు వైట్ హౌజ్‌లో విందు ఇచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడిని రెచ్చగొట్టేలా ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు చేశారని పోస్టులో పేర్కొన్నారు.
Read Also: CJI BR Gavai: ‘‘అన్ని మతాలను గౌరవిస్తాను’’.. ‘‘విష్ణువు’’ వ్యాఖ్యలపై సీజేఐ గవాయ్..
మన ప్రధాని చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన కొద్ది రోజులకే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చైనా రహస్య సైనిక సముదాయాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి చూపించారని ఆయన చెప్పారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్-సౌదీతో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేసిందని జైరాం రమేష్ అన్నారు. ఇది భారత జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని చెప్పారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశమైనా ఈ రెండు దేశాల్లో ఒక దేశంపై దాడి చేసినా, రెండో దేశంపై చేసినట్లే అవుతుందని ప్రకటించింది. ఖతార్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిన కొన్ని రోజులకే ఈ ఒప్పందం వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు తమ భద్రతను పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం, సౌదీ అరేబియా ఇజ్రాయిల్ టార్గెట్‌గా ఈ ఒప్పందంపై సంతకం చేసిందని చెబుతున్నారు. దీనిపై భారత విదేశాంగ స్పందిస్తూ.. భారతదేశం తన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ మరియు ప్రపంచ స్థిరత్వం కోసం ఈ చర్య యొక్క చిక్కులను అధ్యయనం చేస్తుందని చెప్పింది.
