Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్ గాంధీకి సీటు కేటాయింపుపై వివాదం.. అసలు ప్రోటోకాల్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: గణతంత్ర వేడుకల్లో లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు సీట్ల కేటాయింపు వివాదంగా మారింది. మూడో వరసలో వీరిద్దరికి సీట్లు కేటాయించారు. ఇలా తమ నేతలను మూడో వరసలో కూర్చోబెట్టడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని పార్టీ ఆరోపిస్తోంది. తమ పాలనలో ఎల్‌కే అద్వానీకి ముందు వరస సీటు కేటాయించామని చూపుతూ ఒక ఫోటోను కాంగ్రెస్ విడుదల చేసింది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రతిపక్ష నాయకుడి పట్ల ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం ప్రోటోకాల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆత్మన్యూనతా భావంతో బాధపడుతోందని, ఇది వారి నిరాశను వెల్లడిస్తుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవమానించిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపించారు. 2014లో ఎల్‌కే అద్వానీకి ముందు వరసలో సీటు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ఒక ఫోటోను రిలీజ్ చేశారు. అయితే, దీనికి కౌంటర్‌గా 2014లో రాజ్యసభలో, లోక్‌సభలో ఎల్‌కే అద్వానీ ప్రతిపక్ష నేత కాదని, ఆ సమయంలో అరుణ్ జైట్లీ రాజ్యసభలో, సుష్మా స్వరాజ్ లోక్‌సభలో ప్రతిపక్ష నేతలుగా ఉన్నారని బీజేపీ చెప్పింది.

ప్రోటోకాల్ నిబంధనలు ఏం చెబుతున్నాయి.?

ఈ ఆరోపణలపై కేంద్రం అధికారికంగా స్పందించనప్పటికీ, ఇలాంటి కార్యక్రమాల్లో సీట్ల కేటాయింపులు రాష్ట్రపతి సెక్రటేరియట్ జారీ చేసిన ప్రాధాన్యతా ప్రకారం ఖచ్చితంగా ఉంటాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రుల తర్వాత ప్రతిపక్ష నాయకులు ప్రాధాన్యతా క్రమంలో 7వ స్థానంలో ఉంటారు.

దీనిని రాజకీయం చేయడంపై కాంగ్రెస్‌పై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘రాహుల్ గాంధీ మూడో వరుసలో కూర్చోవడం గురించి ఆందోళన చెందడం లేదు, కర్తవ్యపథ్‌లో దేశం బ్రహ్మోస్ క్షిపణులను సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో తను ఫోన్‌ను చూస్తూ దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు’’ అని బీజేపీ నేత ప్రదీప్ భండారీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Exit mobile version