Bharat Jodo Yatra 2.0: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు మరోసారి భారత్ జోడో యాత్ర నిర్వహించాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ కోరింది. గతేడాది సెప్టెంబర్ నెలలో మొదలైన భారత్ జోడో యాత్ర తమిళనాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగింది. ఈ సారి భారత్ జోడో యాత్రం 2.0 తూర్పు నుంచి పడమర వరకు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు మరోసారి యాత్ర నిర్వహించాలని తామంతా రాహుల్ గాంధీని అభ్యర్థించామని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గురువారం తెలిపారు.
Read Also: Czech Republic: ప్రేగ్ యూనివర్సిటీలో దుండగుడి కాల్పులు.. పలువరి మరణం..
ఈ రోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో జోడో యాత్ర గురించి చర్చించారు. యాత్రపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ రోజు జరిగిన సమావేశంలో లోక్ సభ ఎన్నికల వ్యూహం, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి గురించి చర్చించారు. దీంతో పాటు పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ గురించి నేతలు మాట్లాడారు. మరో రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో కమిటీని ప్రకటిస్తామని వేణుగోపాల్ తెలిపారు.
సెప్టెంబర్ 7, 2022న తమిళనాడు కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రం ప్రారంభించారు. దాదాపుగా 4080 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. జనవరి 2023లో జమ్మూ కాశ్మీర్లో ఈ యాత్ర పూర్తయింది. 126 రోజుల పాటు 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భణం గురించి రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.