కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ చాలా బాగా జరిగిందంటూ కొనియాడారు. పెద్ద కార్యక్రమాల్లో కొన్ని అవాంతరాలు జరుగుతుంటాయని.. అయినా కూడా కేంద్రం చాలా బాగా నిర్వహించిందని మెచ్చుకున్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏఐ సమ్మిట్‌ను విమర్శించారు. ‘‘అస్తవ్యస్తమైన ప్రజా సంబంధాల ప్రదర్శన’’ అని అభివర్ణించారు. చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తీవ్రంగా తప్పుపట్టారు.
ఫిబ్రవరి 17న జరిగిన శిఖరాగ్ర సమావేశాల ప్రారంభ రోజున పొడవైన క్యూలు, భారీ జనసమూహం, లాజిస్టికల్ సమస్యలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భద్రతా సిబ్బంది నుంచి స్పష్టమైన సూచనలు లేకుండానే గేట్లు మూసేశారని సందర్శకులు తెలిపారు. పెద్ద ఎత్తున వార్తలు హల్‌చల్ చేశాయి. అలాగే గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం వివాదానికి దారితీసింది. ‘‘ఓరియన్’’ అనే రోబోటిక్ కుక్కపై విమర్శలు రావడంతో ఆ విశ్వవిద్యాలయాన్ని ఎక్స్‌పో స్థలాన్ని ఖాళీ చేయమని కోరారు.
ఇదిలా ఉంటే ఏఐ సమ్మిట్ నిర్వహణను రాహుల్ గాంధీ తప్పుపడితే.. శశిథరూర్ మాత్రం అభినందించారు. ‘‘శిఖరాగ్ర సమావేశానికి వెళ్లే అవకాశం నాకు లభించకపోయినా శుక్రవారం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నాకు అర్థమైనంత వరకు మొదటి రెండు రోజులు చాలా బాగా గడిచాయి. కొన్ని లోపాలు, కొన్ని సంస్థాగత విషయాలు ఉన్నాయి. ఇవి ఒక పెద్ద కార్యక్రమంలో జరుగుతాయి.’’ అని శశిథరూర్ తెలిపారు.
ఇటీవలే శశిథరూర్‌తో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలపై చర్చించారు. కేరళ ఎన్నికల వేళ ఇదో శుభపరిణామంగా భావించారు. మళ్లీ ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ.. మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని శశిథరూర్ ప్రశంసించారు.
