దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై సొంత పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాజీవ్ గాంధీ రెండు సార్లు చదువులో ఫెయిల్యూర్ అయ్యారని.. అయినా కూడా ఆయన ప్రధానమంత్రి కావడం ఆశ్చర్యం కలిగించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ అస్త్రంగా మార్చుకుంది.
మణిశంకర్ ఏమన్నారంటే..
రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యషించేటప్పుడు రెండు సార్లు విఫలం చెందారని తెలిపారు. యూనివర్సిటీ ఇమేజ్‌ను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఉత్తీర్ణులవుతారని.. కానీ కేంబ్రిడ్జ్‌లోనూ… లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలోనూ రెండు చోట్ల రాజీవ్ గాంధీ ఫెయిల్యూర్ అయ్యారన్నారు. అలాంటి వ్యక్తి.. దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు తాను చాలా ఆశ్చర్యపోయానని మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ కోవర్టుగా మారి వ్యక్తిగత విమర్శలకు దిగారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ అయ్యర్ మండిపడ్డారు. అయినా చదువులో వైఫల్యం చెందడం పెద్ద విషయం కాదని… ఉత్తమ వ్యక్తులు కూడా కొన్నిసార్లు విఫలమయ్యారని చెప్పుకొచ్చారు. రాజీవ్.. చదువులో విఫలం అయి ఉండొచ్చు… కానీ రాజకీయాల్లో విఫలం కాలేదు కదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విజయవంతమయ్యారని తారిఖ్ అన్వర్ అయ్యర్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన విధానాలను గుర్తుచేశారు. రాజీవ్ హయాంలోనే పంచాయతీ రాజ్‌ను ప్రవేశపెట్టారని తెలిపారు. అలాగే ఆయన వల్లే ఐటీ విప్లవం వచ్చిందన్నారు. అంతేకాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచారని చెప్పారు. అలాగే శాస్త్రీయ పురోగతిని ప్రోత్సహించారని.. కేవలం ఐదు సంవత్సరాల్లోనే ఇంత గొప్ప విజయాలను రాజీవ్ సాధించారని గుర్తుచేశారు.
మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి చరణ్ సింగ్ సప్రా కూడా ఖండించారు. కాంగ్రెస్‌లో ఉంటూ… పార్టీ ప్రతిష్టను పదే పదే దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం భావ్యం కాదని ఆరోపించారు. బీజేపీకి తొత్తుగా మారి.. లేనిపోని కథనాలు సృష్టిస్తున్నారని.. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత ఇదేనా? అని ప్రశ్నించారు. బహుశా వార్తల్లో ఉండేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు.. కాంగ్రెస్‌లో ఎంపీగా ఎందుకయ్యారని.. కేంద్రమంత్రిగా ఎందుకు పని చేశారని నిలదీశారు. మణిశంకర్ అయ్యర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే.. సోనియాగాంధీ రాజ్యసభకు పంపించిన విషయాన్ని మరిచిపోయారా? అని అడిగారు. ఇవన్నీ మరిచిపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. బీజేపీకి స్లీపర్ సెల్‌గా పని చేస్తూ.. కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. ప్రజలు అతని మాటలు నమ్మొద్దని చరణ్ సింగ్ సప్రా కోరారు.