Congress: బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ‘‘ఓట్ చోరీ’’కి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ రోజు(ఆదివారం) ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తీవ్ర ఆరోపణలు చేశారు. అండమాన్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సత్యమేవ జయతే అనే నినాదాన్ని మనం అందరి విన్నామని, కానీ సత్యం అనేది లేకుండా అధికారమే ముఖ్యమని మోహన్ భగవత్ అంటున్నారని విమర్శించారు. సత్యం, అసత్యం మధ్య యుద్ధం జరుగుతోందని ఆయన అన్నారు.
బీజేపీ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని, సత్యం కోసమే కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని, హర్యానా ప్రజల ఓటు హక్కును హరించారని ఆరోపించారు. బ్రెజిల్ మహిళ హర్యాన ఓటటర్ లిస్ట్‌లో నమోదయ్యారని, యూపీకి చెందిన బీజేపీ నేత హర్యానాలో ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు. సత్యం కోసం దేశం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతోందని అన్నారు. ‘‘ఓట్ చోర్, గద్దె ఛోడ్’’ అని దేశ ప్రజలు నినదిస్తున్నారని చెప్పారు. ఓట్లు దొంగతనం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది దేశమంతా భావిస్తోందని, అంతిమంగా సత్యందే గెలుపు అని, సత్యం భోధించిన మహత్మా గాంధీ బాటలోనే నేను నడుస్తున్నానని అన్నారు. ప్రధాని మోడీ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని మోడీ, అమిత్ షాకు దొరికిపోయామని అర్థమైందని, అంతిమంగా మోడీ, అమిత్ షాలకు ఓటమి తప్పదని అన్నారు.
ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ప్రజాహితం కోసం ఏర్పడిన సంస్థలపై యుద్ధం జరుగుతోందని, ఈ యుద్ధం దేశంలోని ప్రతీ బిడ్డపై జరుగుతోందని, ఓట్ల దొంగతనం తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ ఆత్మవిశ్వాసం సడలిపోయిందని, కళ్లల్లో కళ్లుపెట్టి చూడలేకపోతున్నారని, మాట్లాడలేకపోతున్నారని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సంధు, జోషి లు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని, సగటు దేశ పౌరుడి ఓటు హక్కును వీరంతా హరించారని ఆరోపించారు.