Bangladesh: పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చనిపోయారు. హఠాత్తుగా ఒకరు, ఇద్దరు బైక్‌పై వస్తారు, తమ లక్ష్యంగా ఉన్న ఉగ్రవాది దగ్గరకు వచ్చి, గుండెల్లో బుల్లెట్లు దించి, క్షణాల్లో అక్కడ నుంచి పరారవుతుంటారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్క ‘‘గుర్తు తెలియని వ్యక్తి’’ని పట్టుకోలేకపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ దాడుల వెనక భారత గూఢచార సంస్థ ఉందని ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాకిస్తాన్ మాదిరిగానే ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ బంగ్లాదేశ్‌లోకి ఎంటరైనట్లు తెలుస్తోంది. తాజాగా, రాజధాని ఢాకాలో రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదిని అతి దగ్గర నుంచి కాల్చారు. తీవ్ర గాయాలైన హాదిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనా గతేడాది ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడయ్యాడు. దీని తర్వాత, బంగ్లా వ్యాప్తంగా మతోన్మాదం, భారత వ్యతిరేకత పెరిగింది.
ఇక షరీఫ్ ఉస్మాన్ హాది భారత మ్యాప్‌ను కించపరిచే విధంగా ‘‘గ్రేటర్ బంగ్లాదేశ్’’ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భారత తూర్పు, ఈశాన్య ప్రాంతాలను బంగ్లాదేశ్‌లో కలుపుతూ వివాదాస్పద పోస్ట్ చర్చనీయాంశం అయింది. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు హాదిని టార్గెట్ చేశారు. హాధి శనివారం ఢాకాలోని రద్దీ ఉన్న పాల్టాన్ ప్రాంతంలో రిక్షాలో వెళ్తున్న ఆయనపై కాల్పులు జరిగాయి. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపి పారిపోయారు. ఇద్దరు వ్యక్తులు కూడా హెల్మెట్లను ధరించారు.
హాదిని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అతడి తల, ఛాతిలో బుల్లెట్ గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం నాడు హాది “గ్రేటర్ బంగ్లాదేశ్” మ్యాప్‌ను కలిగి ఉన్న రెచ్చగొట్టే ఫేస్‌బుక్ పోస్ట్‌ను షేర్ చేసిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. ఆ మ్యాప్‌లో బంగ్లాదేశ్‌ను మాత్రమే కాకుండా తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను కూడా చూపించారు, దీనితో ఆ పోస్ట్ చాలా వివాదాస్పదమైంది. మహ్మద్ యూనస్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిని న్యాయస్థానం ముందు నిలబెడుతామని ప్రకటించారు.