Congress: పెట్రోల్-డిజిల్ ధరలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో కేంద్రం ఇంధన ధరల్ని మార్చి 15 నుంచి రూ. 2 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్-డిజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, 27 లక్షల ద్విచక్రవాహనాలు, 58 లక్షల భారీ వాహనాలు, 6 కోట్ల కార్ల నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఈ తగ్గింపును రాహుల్ గాంధీ ఘనతగా కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ నేత నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రభావం చూపిందని, అందుకే కేంద్రం ఇంధన ధరల్ని తగ్గించిందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ శుక్రవారం అన్నారు.
Read Also: Bramayugam : ఓటీటీలోకి వచ్చేసిన ‘భ్రమయుగం’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఇంధన ధరల్ని తగ్గించడం మంచి విషయమని, భారత్ జోడో న్యాయ్ యాత్ర కొంత ప్రభావం చూపిస్తోందని ఆయన అన్నారు. అంతకుముందు కేంద్రం ఎల్పీజీ సిలిండర్లపై రూ. 100 తగ్గించింది. అయితే దీనిని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిదంబరం విమర్శించారు. ఎన్నికల తర్వాత(మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే) ధరలు పెంచబోమని ప్రభుత్వం ప్రకటిస్తుందా..? ఎల్పీజీ సిలిండర్ ధరను బీజేపీ ప్రభుత్వం రూ. 700 పెంచి, ఎన్నికల సందర్భంగా రూ.100 తగ్గించిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పెట్రోల్, డిజిల్ విషయంలో కూడా కేంద్రం ఇదే విధమైన చేతివాటాన్ని ప్రదర్శించిందని ఆయన విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ఇలా ధరల్ని తగ్గిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల మహిళా దినోత్సం(మార్చి8)న ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ తగ్గింపు దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ అన్నారు. ఎల్పీజీ ధరలు తగ్గించిన సమయంపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఎన్సీపీ నేత, ఎంపీ సుప్రియా సూలే దీనిని ఎన్నికల స్టంట్‌గా వ్యాఖ్యానించారు. గత 7 నెలలుగా ధరల్ని ఎందుకు తగ్గించలేదని టీఎంసీ కేంద్రాన్ని ప్రశ్నించింది.
