Bharat Jodo Yatra To Complete 1000 Km Tomorrow: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కీలక మైలురాయిని చేరుకుంది. శనివారం జరిగే రాహుల్ గాంధీ 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకుంటుంది. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయింది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తై ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి చేరుకుంది. శనివారం కర్ణాటకలో బళ్లారి జిల్లాకు చేరుకోవడంతో పాదయాత్ర 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకుంటుంది. బళ్లారిలో లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ బహిరంగ సభ జరగనుంది.
భారత్ జోడో యాత్రలో భాగంగా తమిళనాడులో సుమారుగా లక్ష మంది పాదయాత్రలో పాల్గొనగా.. కేరళ చేరే సరికి ఆ సంఖ్య 1.25 లక్షలు, కర్ణాటకలో 1.5 లక్షల మంది చేరగా.. ఆంధ్రప్రదేశ్ లోకి చేరే సరికి సుమారుగా 2 లక్షల మంది యాత్రలో పాల్గొంటారని అంచానా వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాదయాత్రలో అన్ని వర్గాలను కలుస్తున్నారు రాహుల్ గాంధీ.
ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న పాదయాత్ర త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించనుంది. బీజేపీ చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను కలిపే విధంగా భారత్ జోడో యాత్రను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగం, ద్రవ్యోల్బనం, పెరుగుతున్న ధరలపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ. మొత్తం 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. కన్యాకుమారిలో ప్రారంభం అయిన పాదయాత్ర కాశ్మీర్ లో ముగియనుంది.
వరసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ 2024లో అధికారంలోకి రావాాలని ప్రయత్నిస్తోంది. బలమైన బీజేపీని ఢీకొట్టేందుకు భారత్ జోడో యాత్ర సహాయపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ టార్గెట్ గా భారత్ జోడో యాత్రలో విమర్శలు గుప్పిస్తున్నారు రాహుల్ గాంధీ. గత వారం పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు.